ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల మరణాలను అరికట్టేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
- మరణాలను అరికట్టేందుకు అటవీశాఖ ప్రయత్నాలు
- మహారాష్ట్రతో సమాచారం పంచుకోవాలని నిర్ణయం
- సమన్వయ సమావేశం కోసం రాష్ట్ర అటవీశాఖ లేఖ
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల మరణాలను అరికట్టేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మెరుగైన పర్యవేక్షణ, సమన్వయం, సమాచార భాగస్వామ్య వ్యవస్థతో సహా కొన్ని అంశాలను చర్చించడానికి మహారాష్ట్రతో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దరిగావ్ గ్రామంలో రెండు పులులు మరణించిన నేపథ్యంలో కాగజ్‌నగర్‌లో అదనంగా కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.
ఈ సమావేశం తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల అటవీ శాఖల మధ్య సమన్వయం కోసం జరిగే సాధారణ సమావేశమని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్‌ఎం డోబ్రియాల్ తెలిపారు. 10 రోజుల్లో సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. పశువుల పరిహారం సొమ్ము పంపిణీ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైతం అటవీ శాఖ మంగళవారం కాగజ్‌నగర్‌లో సమావేశం నిర్వహించనున్నది.
