Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

వస్తు మారకం!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 9, 2024No Comments

చెట్ల మీద నుంచి కుహూకుహూలు, కిలకిలా రావాలు చేసే రంగురంగుల పక్షులు, పిట్టల మాదిరిగా ఉంది.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌. రకరకాల భాషలు, యాసలు, వేషధారణతో ఉన్న ప్రయాణికులతో భారతదేశం మొత్తం ఇక్కడే కనిపిస్తున్నది. ట్రెయిన్‌ దిగాను. నేనిప్పుడు మెట్రో ఎక్కి ఢిల్లీ యూనివర్సిటీ నార్త్‌ క్యాంపస్‌కు చేరాలి. అక్కడ బీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న మా అబ్బాయిని కలవాలి. నాకు ఢిల్లీ రావడం ఇది రెండోసారి. మూడేళ్ల క్రితం మావాణ్ని చేర్పించడానికి వచ్చాను.

May 21, 2023 / 07:43 AM IST
వస్తు మారకం!

‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.


చెట్ల మీద నుంచి కుహూకుహూలు, కిలకిలా రావాలు చేసే రంగురంగుల పక్షులు, పిట్టల మాదిరిగా ఉంది.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌. రకరకాల భాషలు, యాసలు, వేషధారణతో ఉన్న ప్రయాణికులతో భారతదేశం మొత్తం ఇక్కడే కనిపిస్తున్నది. ట్రెయిన్‌ దిగాను. నేనిప్పుడు మెట్రో ఎక్కి ఢిల్లీ యూనివర్సిటీ నార్త్‌ క్యాంపస్‌కు చేరాలి. అక్కడ బీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న మా అబ్బాయిని కలవాలి. నాకు ఢిల్లీ రావడం ఇది రెండోసారి. మూడేళ్ల క్రితం మావాణ్ని చేర్పించడానికి వచ్చాను. నాకు దారులు గుర్తుండవు. అది నా బలహీనత. అలా నేను మా అబ్బాయి హాస్టల్‌ ఉండే విశ్వవిద్యాలయ ప్రాంతం వెళ్లాలంటే మెట్రో ఎక్కాలి. ఆలోచిస్తూనే పక్కనున్న ప్రయాణికుణ్ని అడిగాను. అతను హిందీలో ఏదో చెప్పినా.. నాకు అర్థం కాలేదు. మా వాడికి ఏదో స్పెషల్‌ క్లాస్‌ ఉన్నదట. నన్నే వచ్చేయమన్నాడు. అందుకే ఈ ప్రయాసలు. అంత వరకూ నన్ను పరిశీలనగా చూసిన ఒక పెద్దాయన.. “నేనూ అటువైపే వెళ్తున్నాను. మీ బ్యాగ్‌ ఇవ్వండి” అన్నాడు హిందీలో. అతణ్ని ఎక్కడో చూసినట్టుంది.

అరవై సంవత్సరాలు పైనే ఉంటాయి. జుట్టు బాగా తెల్లబడింది. సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. బట్టలు ఇస్త్రీవి కాకపోయినా శుభ్రంగానే ఉన్నాయి. నా దగ్గర పెద్ద లగేజీ లేకపోయినా మా అబ్బాయి కోసం పెట్టిన పచ్చడి సీసాలు, తినుబండారాలను మా ఆవిడ ఒకే బ్యాగులో సర్దింది. ఇంకో బ్యాగులో నా బట్టలు, ఆఫీసు ఫైళ్లు. సరే.. ఈయన సాయం వస్తున్నాడు కదా అని ఒక బ్యాగు అందించాను. ఆయనను అనుసరించాను.అతను రెండు ప్లాట్‌ఫామ్స్‌ దాటి.. ఎలివేటర్‌ ఎక్కి, బయటికి నడిచాడు. అక్కడ ఆటోస్టాండ్‌ దగ్గరే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్‌. “విశ్వవిద్యాలయానికి వెళ్లాలి” అన్నాను. తనే టిక్కెట్టు తీసుకొచ్చాడు. తనకు పాస్‌ ఉన్నదట. ప్లాట్‌ఫామ్‌ మీదికి వెళ్లాం. చాలా వేగంగా వచ్చేసింది.. మేం ఎక్కాల్సిన ట్రెయిన్‌.
గబగబా ఎక్కేశాం. రెండు స్టేషన్లు దాటిన తర్వాత అడిగాను.

“తరువాతేనా విశ్వవిద్యాలయం” అని.. వెంటనే జేబులోంచి ఒక కాగితం తీసి చూపించాడు. చావిడి బజార్‌, చాందినీ చౌక్‌, కశ్మీర్‌ గేట్‌, సివిల్‌ లైన్స్‌, విధాన సభ.. ఇవి దాటిన తర్వాత నేను దిగాల్సిన విశ్వవిద్యాలయం స్టేషన్‌. “థ్యాంక్స్‌!” అన్నాను. అరగంట ప్రయాణం తర్వాత నేను దిగాల్సిన స్టేషన్‌ వచ్చేసింది. ప్లాట్‌ఫామ్‌ దాటి బయటికి వచ్చి ఈ-రిక్షా ఎక్కాం. పది నిమిషాల్లో మా వాడి హాస్టల్‌కు చేరుకున్నాం. నేను ఇద్దరి ఆటో చార్జీలు ఇవ్వబోతుంటే.. “మీది మీరు ఇవ్వండి” అంటూ తన సంచిలోంచి రెండు యాపిల్‌ పండ్లు తీసి ఆ ఆటో అతనికి ఇచ్చాడు. వెళ్తున్న అతణ్ని అడిగాను.. “అయ్యా! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడి వారు?” అని.

అతనికి వినిపించలేదేమో.. సమాధానం చెప్పకుండానే కదిలిపోయాడు. నేనే పొరపాటు పడ్డానేమో! ఈయన ఎవరో అనుకున్నాను. ఆటో అతను నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఆయన చేష్టలకు నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రపంచంలో ఎనిమిదో వింత. ఆటో చార్జీలకు బదులు పండ్లు ఇవ్వడం, దానికి ఆటో అతను ఒప్పుకోవడం.. ఆలోచిస్తూనే హాస్టల్లోకి అడుగుపెట్టాను. గేటు దగ్గర ఒక అబ్బాయి.. “నమస్తే అంకుల్‌! హర్ష చెప్పాడు. తనకు క్లాస్‌ ఉంది. రండి” అంటూ గదిలోకి తీసుకెళ్లాడు. “విశ్రాంతి తీసుకోండి!” అంటూ వెళ్లిపోయాడు.చొక్కా తీసి హ్యాంగర్‌కు తగిలించి, వాష్‌రూమ్‌కు వెళ్దాం అనుకునే సరికి.. జేబులోంచి ఒక కాగితం జారి పడింది. అది అన్నయ్య రాసిన లెటర్‌. ఆ ఉత్తరం సారాంశం.. మా ఇద్దరికీ తండ్రిగారి నుంచి సంక్రమించిన ఆ పాత ఇంటిని వదిలేయమంటున్నాడు.‘అమ్మను, నాన్నను నేనే చూసుకున్నాను.. నీకు భారం లేకుండా.

నీది గవర్నమెంట్‌ ఉద్యోగం. మీ ఆవిడా బ్యాంక్‌ ఉద్యోగి. నేను ఈ పల్లెటూళ్లో సింగిల్‌ టీచర్‌. నీ కొడుకు ఢిల్లీలో, కూతురు అమెరికాలో చదువుతున్నారు. నా పిల్లలు సరిగ్గా సెటిల్‌ కాలేదు’.. ఇదీ అన్నయ్య వేదన. ‘ఆయనకు ఆ పల్లెటూళ్లో ఖర్చులేం ఉంటాయి! పైగా వాళ్ల ఆవిడ తరఫున కొద్దో గొప్పో భూమి ఉంది. మనకూ కూతురు ఉంది. పెళ్లి చేయాలి కదా! మన వాటా వదులుకోకండి!’ ఇదీ మా ఆవిడ వాదన. వాదనకు ఓటెయ్యాలా!? వేదనకు చోటివ్వాలా!? తేల్చుకోలేకుండా ఉన్నాను.

ఆలోచనల్లో ఉండగానే మా అబ్బాయి వచ్చేశాడు. “డాడీ!”.. అంటూ హుషారుగా నన్ను చుట్టేశాడు. పావుగంట కబుర్ల తర్వాత.. తన మిత్రులతో కలిసి భోజనం చేయడానికి ఓ సౌత్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌కు బయల్దేరాం. ఆ హోటల్లో కస్టమర్ల రద్దీ. భోజనం బాగుంటుందని వేచి చూస్తూ కూర్చున్నాం. “ఏమిటీ ఢిల్లీలో వింతలు, విశేషాలు!?” అడిగాను.

“ఒక అంతర్జాతీయ వింత గురించి చెపుతాం.. కాదు చూపిస్తాం!” అంటూ.. క్యాటరింగ్‌ వాళ్ల నుంచి కూరలు తీసుకెళ్తున్న వ్యక్తిని చూపించాడు మా అబ్బాయి. నేను ఆశ్చర్యపోయాను. ఉదయం ఆటో అబ్బాయికి డబ్బుకు బదులుగా యాపిల్‌ పండ్లు మారకం చేసినవ్యక్తి.. “ఈయన నాకు తెలుసు. ఉదయం నాకు దారి చూపించింది ఈయనే! అయితే ఎక్కడో చూసిన ముఖం. ఔను. మా ఊళ్లో ఒక హోటల్‌ యజమాని. ఈయనలా ఉంటాడు” అన్నాను.

“ఆయనేనేమో!?” అన్నాడు మా అబ్బాయి.“లేదు.. ఆయన చనిపోయాడు. వందశాతం కరెక్ట్‌! మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు. ఇంతకీ ఈయన ఢిల్లీలో ఏం చేస్తున్నాడు?” అన్నాను.
“ఇడ్లీ వ్యాపారం. కరెక్ట్‌గా ఏ నాలుగు రోడ్ల జంక్షనులోనో దుకాణం తెరుస్తాడు. ఒక గ్యాస్‌స్టవ్‌, ఇడ్లీ కుక్కర్‌ అంతే! గబగబా ఒక పాతిక వాయిల ఇడ్లీలు వేస్తాడు. మెత్తగా, హాయిగా తినేలా ఉంటాయి. దాంట్లోకి చట్నీ, కారప్పొడి. అయితే.. ఇడ్లీలు కొంటే డబ్బులు తీసుకోడు” అన్నాడు మా అబ్బాయి.

“మరి ఫ్రీగానా..?!” అన్నాను ఆశ్చర్యంగా. “కాదు.. ఇడ్లీల ఖరీదు బదులు ఏదైనా ఇవ్వాలి. బిస్కట్‌ ప్యాకెట్లో, పండ్లో, కూరగాయలో..” అన్నాడు. “మరి అందరికీ అవి దొరకవు కదా! బీదా, బిక్కీ దగ్గర అవి లేకపోతేనో..?!” అన్నాను. “అలా ఎవరు ఏమీ ఇవ్వకపోయినా.. వారికి ఫ్రీయే! అయితే వారిచేత పని చేయిస్తాడు. ప్లేట్లు కడగడమో, పంపు దగ్గరనుంచి నీరు తేవడమో!” అన్నాడు. “మై గాడ్‌! మరి అతనికి ఇడ్లీలు, చట్నీ చేయడానికి ముడిసరుకు ఎలా వస్తుంది? వాటికైనా డబ్బు ఇవ్వాలి కదా?” అన్నాను. “ఏదోలాగా మేనేజ్‌ చేస్తాడట! వారికి డబ్బులివ్వడట! ఈయన మీద లోకల్‌ పేపర్లో ఆర్టికల్‌ వచ్చింది. ఈయనకు ఏం కావలిస్తే అవి ఫ్రీగా ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఎందుకంటే తనకు ఇడ్లీలు అమ్మగా వచ్చిన వాటిని స్లమ్‌ ఏరియాలో పేదలకు పంచేస్తాడు. అయితే రోజూ ఇడ్లీలు ఉండవు. ఒకరోజు దోసెలు, ఇంకోరోజు పొంగల్‌, మరోరోజు బీసీబేళా బాత్‌.. అవన్నీ రుచిగా వండుతాడు” చెబుతున్నాడు మా అబ్బాయి. ఇంతలో మా భోజనం ప్లేట్లు వచ్చాయి. అందరం ఆకలిమీద ఉండటంతో ప్లేట్లమీద పడ్డాం. అరగంట తర్వాత మా అబ్బాయి సహా వాడి మిత్రులను అడిగాను.“ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడు?! ఇలా డబ్బు బదులు ఆహారం బదిలీ..” అన్నాను.వాళ్లు వెంటనే అన్నారు..

“ఆయన డబ్బును వదులుకుందామనే ఉద్దేశంతో ఉన్నాడు. బహుశా.. డబ్బు మీద వ్యామోహం లేనివాడై ఉంటాడు!” అని. “దీనిని బార్టర్‌ సిస్టమ్‌ అంటారు. అంటే తమకున్న వస్తువులు అవి లేనివారికి మారకం చేసి, వారి దగ్గరనుంచి తమకు కావాల్సిన వస్తువులు తీసుకుంటారు. ఈ వస్తు మారకంలో డబ్బుతో పనిలేదు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. తమ వస్తువులు వృథా పోవు. ఈ రకమైన పద్ధతి క్రీ.పూ. 3000వ సంవత్సరంలో మెసపటోమియా నాగరికతలో ఉపయోగించారు. అయితే ఈ పద్ధతి అమలు చేయాలంటే.. నైతికత, నిబద్ధత ముఖ్యం. ఒకరికి ఎక్కువ విలువైన వస్తువులు రావచ్చు. ఇంకొకరు నష్టపోవచ్చు. అయితే ప్రతిఫలం ప్రశాంత జీవితం. ఆర్థిక జంజాటాలు ఉండవు. డబ్బు ప్రసక్తి లేని వ్యవస్థలో మనిషికి ఆనందం దొరుకుతుంది. ఆస్తులు, అంతస్తులు, పేద, ధనిక, భేదాలు ఉండవేమో!” అన్నాడు ఎకనామిక్స్‌ చదివే మా అబ్బాయి.

నాకు మా అబ్బాయితోపాటు తన మిత్రులను చూసి ఆనందం కలిగింది. ఈ చిన్న వయసులో ఆ పెద్దాయన ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్నారని అనిపించింది. ‘వారు సరైన దారిలోనే వెళ్తున్నారు. వెళ్లాల్సింది పెద్దలమైన మేం కదా!’ అనుకున్నాను. భోజనం పూర్తిచేసి వాష్‌ బేసిన్‌ దగ్గరికి వెళ్లాను. అక్కడికి పొడుగ్గా, సన్నగా ఉన్న ఒక యువకుడు వచ్చి.. “ఎక్స్‌క్యూజ్‌మీ సర్‌.. ఇందాక మీరు ఓ ఇడ్లీ పెద్దాయన గురించి మాట్లాడుకున్నారు కదా! ఆయన్ని మీరు ఎక్కడ కలిశారు?!” అని అడిగాడు. “ఢిల్లీ యూనివర్సిటీ హాస్టల్‌ దగ్గర..” అని చెప్పాను.. అతని వంక పరిశీలనగా చూస్తూ.“ఆయన ఎక్కడ దొరుకుతాడు?”.. మళ్లీ అడిగాడు. “ఇప్పుడే హోటల్లో ఏదో కొనుక్కొని వెళ్లారు. బహుశా వాటిని పంచడానికి ఏ స్లమ్‌ ఏరియాకో వెళ్లి ఉంటారు” అన్నాడు నా వెనక వచ్చిన మా అబ్బాయి.

“ఆయనతో ఏం పని?” అన్నాను అనుమానంగా. సమాధానం చెప్పకుండా ఆ యువకుడు వేగంగా ఆ హోటల్‌ నుంచి బయటికి నడిచాడు.నా గుండెల్లో రాయిపడింది. కొంపదీసి ఈ పెద్దాయనను ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఆయన గురించి ఎంక్వయిరీ చేసిన యువకుడు.. ఒక ‘డాన్‌’లా కనిపించాడు. నల్ల కళ్లద్దాలు, తెల్లబట్టలు. ఎందుకో ఆ క్షణంలో కొద్దిగా నా గుండె దడదడలాడింది. అవన్నీ మనసులోనే దాచుకుని, ఆ హోటల్‌లోంచి బయటపడ్డాను. ఆఫీసు పనికోసం సుప్రీంకోర్టుకు బయల్దేరాను.. మా అబ్బాయి బుక్‌చేసిన టాక్సీలో. టాక్సీ ఎక్కిన నేను గతంలోకి వెళ్లాను.

* * *

మా ఊళ్లో ఒక పెద్దాయనది ఇడ్లీ వ్యాపారం. పేరు చలమయ్య. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు గురవయ్య, చిన్నవాడు ధర్మయ్య. చలమయ్య సైకిల్‌ మీద ఇడ్లీలు అమ్మే స్థాయి నుంచి ఒక కార్పొరేట్‌ స్థాయిలో ఇడ్లీ వ్యాపారవేత్తగా ఎదిగాడు. మా చిన్నప్పుడు రూపాయికి ఐదు ఇడ్లీలు. దానితోపాటు చట్నీ, కారప్పొడి, నెయ్యి, ఇంకా కావాల్సినంత సాంబారు. వ్యాపారం అంత ఎదిగినా ఆ ధరలు మాత్రం ఎదగలేదు. అవి సామాన్యుడికి అందుబాటులో ఉండేవి. ఆయన తర్వాత ఆయన కొడుకులు గురవయ్య, ధర్మయ్య.. ఆయన పంథాలోనే ఆ హోటళ్లు నడిపారు. అయితే ఆ ఇద్దరికీ పిల్లలు పుట్టి.. వాళ్లు పెద్దవాళ్లయి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు, పెద్ద కాలేజీల్లో లా పట్టాలు పొందేసరికి.. తమ తండ్రుల వ్యవహారం నచ్చలేదు.
‘దేశంలో సంపన్నుల జాబితాలోకి వెళ్లాల్సిన వాళ్లం. ఇంకా రాష్ట్రస్థాయి ధనికుల జాబితాలోనే ఉండిపోయాం!’ అనుకుని, చదువు తమకు నేర్పిన ఆర్థిక సూత్రాలు అమలుపరిచారు.

ఇది పెద్దవాళ్లయిన గురవయ్య, ధర్మయ్యకు నచ్చలేదు. వాదోపవాదాలు జరిగాయి. ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గురవయ్యగారు తన అరవై అయిదో ఏట ఒక రాత్రిపూట గుండెపోటుతో చనిపోయాడు. తమ్ముడు ధర్మయ్య.. అరవై ఏళ్లవాడు. అన్నయ్య మరణం తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆస్తి తగాదా మొదలయింది. వాళ్ల తాతగారు మొదలుపెట్టిన మొదటి హోటల్‌ భవనం, స్థలం కోట్లలో పలుకుతున్నది. అది ధర్మయ్య పేరున ఉన్నది. అది తమదే అంటూ గురవయ్య పిల్లలు కోర్టుకెక్కారు. ‘కాదు మా నాన్నది’ అంటూ ధర్మయ్య పిల్లలు దానికి కౌంటర్‌ వేశారు. కారణం.. అది ధర్మయ్యదే! తన భార్యనుంచి సంక్రమించిన స్థలం కాబట్టి వారు పోరాడి కోర్టులో గెలిచారు. అయితే, అలా గెలిచిన ఆ స్థలం తన కొడుకులకు చెందాల్సింది.. తిరిగి తన అన్న కొడుకులకు రాసేసి, తాను తీర్థయాత్రల కోసం బస్‌ ఎక్కాడు. అయితే ఆ బస్సుకు ఘోర ప్రమాదం జరిగి.. గోదావరిలో బోల్తా పడి కొట్టుకుపోయింది. అలా ధర్మయ్య చనిపోయాడు.

* * *

నేనెక్కిన కారు సుప్రీంకోర్టు ఆవరణలో ఆగింది. నా ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. ఆ ధర్మయ్యగారు.. ఈ ఢిల్లీ నగరంలోని పెద్దాయనలా ఉండటమే నాకు షాక్‌ కలిగించింది. కోర్టు లోపలికి వెళ్లి, నా పనుల్లో తలమునకలయ్యాను.. ఆలోచనలకు స్వస్తి చెప్పి. కోర్టులో పని ముగించుకుని తీరిక లభించడంతో.. తాపీగా మెట్రో స్టేషన్లో ట్రెయిన్‌ ఎక్కి విశ్వవిద్యాలయం స్టేజీ దగ్గర దిగాను. మా వాడి హాస్టల్‌ వైపు నడక సాగించాను. అయితే కొంతదూరం నడిచేసరికి దారి తప్పాను. అయోమయంగా అనిపించింది.ఇంతలో ఒక టీ బంకు కనిపిస్తే ఆగాను. “సార్‌!” అంటూ మధ్యాహ్నం హోటల్‌ దగ్గర ఆ పెద్దాయన గురించి ఎంక్వయిరీ చేసిన యువకుడు, అతని వెనక ఇంకో నలుగురు అదే వయసు వాళ్లు కనిపించారు. అంతా ఖరీదైన మనుషుల్లాగే ఉన్నారు. “సార్‌.. మీరు చెప్పిన దారిలో వెతికాం. ఆయన దొరకలేదు” అన్నాడు ఆ యువకుడు. “మీరెవరు? ఆయనతో మీకేం పని?” అన్నాను. “మీరు హోటల్లో అందరికీ ఇడ్లీలు అమ్మే పెద్దాయన గురించి చెబుతుంటే విన్నాం. ఆయన పేరు ధర్మయ్య. మా చిన్నాయన. ఈ అబ్బాయిలు వారి పిల్లలు. ఆయన కోసం వెతుక్కుంటూ ఢిల్లీ వచ్చాం. ఇక్కడ ఉన్నాడని తెలిసి..” చెప్పాడతను.

నేను వారి మాటలకు ఆశ్చర్యపోయి.. “ధర్మయ్యగారు బస్సు ప్రమాదంలో చనిపోయారు కదా?” అన్నాను. “లేదు! మా చిన్నాన్న చనిపోలేదు. బస్‌ ఎక్కే ముందు ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లాల్సివచ్చింది. అయితే, ఆయన సీటులో బ్యాగు, శాలువా, స్వెట్టర్‌ ఉంచి కిందికి దిగాడు. ఆయన ఉన్నాడనుకొని డ్రైవర్‌ బస్‌ పోనిచ్చాడు. ఆ బస్‌ గోదావరిలో పడింది. ఆయన చనిపోయాడని అందరం అనుకున్నాం. డెడ్‌బాడీ దొరక్కపోవడంతో ఆరు నెలల తర్వాత తెలిసింది.. ఆయన బస్‌ ఎక్కలేదని. వెతికితే ఢిల్లీలో ఉన్నాడని తెలిసి వచ్చాం. ఆయన దొరకడంలేదు” అన్నాడతను విచారంగా. నేను క్షణం ఆలోచనలో పడి.. “ఆయన దారిలో వెళ్లండి.. దొరుకుతాడు” అన్నాను స్థిరంగా. “అంటే?!” అన్నారు వాళ్లు అయోమయంగా. “అదే.. ఆయన దారే!” అన్నాను మళ్లీమళ్లీ.

అతను ఒక్కక్షణం ఆగి.. “మీరు చెప్పిన విషయం అర్థమైంది. దారి తప్పిన వాళ్లమని మా చిన్నాన్న మమ్మల్ని, ఆయన పిల్లల్ని వదిలి తన దారి వెతుక్కున్నాడు. మాకు ఇప్పటికి అర్థం అయింది. ఆయన చూపిన దారే బాగుందని. అందరం కలిసిపోయాం. ఈ ఆనందం ఆయనతో పంచుకోవాలని వస్తే.. ఆయన దొరకడంలేదు” బాధగా చెప్పాడు అతను. “ఫరవాలేదు. దొరుకుతాడు” అన్నాను. వారి ముఖాల్లో సంతోషం కనిపించింది. అక్కడినుంచి కదిలారు. నేను వారికి చెప్పిన విషయం నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. కుతంత్రపు ప్రపంచం బొరుసైతే.. అది ధర్మాన్ని దారి తప్పించేది. అది నాణేనికి ఒక వైపు. ఈ ధర్మయ్యగారు మరో వైపు. ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మా అబ్బాయిలాంటి యువతరం, ఇంకా ఆ పెద్దాయన దారిలోకే నడవడం సాగిస్తున్న ఆయన కుటుంబం.

అలా ఆలోచనల్లో ఉన్న నేను.. పక్కకు తిరిగి చూస్తే మా అబ్బాయి హాస్టలు వైపుగా, రోడ్డు పక్కలో ఉన్న రావిచెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తున్న ఒక యాచకురాలు. ఆమె చుట్టూ కోతుల గుంపు. తన అన్నాన్ని వాటికి పంచుతున్నది. ఆ చెట్టు చూసేసరికి హాస్టల్‌ వైపు వెళ్లడానికి దారి తెలిసింది. అలాగే నాకు మనసులో తొలుస్తున్న సమస్యకు దారి దొరికింది. నా జేబులో గుండెకు దగ్గరగా ఉన్న మా అన్నయ్య రాసిన ఉత్తరం రేపిన అలజడి లేదు.
అన్నయ్యకు ఫోన్‌ చేయడానికి నిర్ణయించాను. వాదనలో అర్థం ఉన్నా.. వేదనలో పరమార్థం ఉన్నదని బోధ పడింది.

వెంటనే ఫోన్‌ చేశాను. “అన్నయ్యా! ఆ ఇల్లు నువ్వే తీసుకో. ఒక పని మాత్రం నా కోసం చెయ్యి!” అన్నాను. “ఏమైనా డబ్బులు ఇమ్మంటావా? ఎంత ఇమ్మంటావో చెప్పు. ఇస్తాను” అన్నాడు అన్నయ్య. “డబ్బులేమీ వద్దు. వస్తు మారకం.. అంటే బార్టర్‌ సిస్టమ్‌”. “అంటే ఏంటిరా?” అన్నాడు అన్నయ్య. “మన చిన్నప్పుడు అమ్మ పని చేసుకుంటూ.. మన ఇంటి పెరట్లో ఉన్న వేపచెట్టుకు ఉయ్యాల కట్టి, దాంట్లో నన్ను ఉంచేది. నువ్వు ఉయ్యాల ఊపుతూంటే.. నేను నిద్రపోయేవాణ్ని. అందుకే ఆ చెట్టు కొట్టించకు. అక్కడ మళ్లీ ఉయ్యాల కట్టి, దాంట్లో ఊగాలని ఉంది నాకు. నన్ను ఊపేది నువ్వే!” అన్నాను. అవతలి నుంచి ఏడుస్తున్న అన్నయ్య. అవి ఆనందబాష్పాలు. నా కళ్లు కూడా తడిశాయి సాంత్వనతో..

డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు

డాక్టర్‌ ఎం. సుగుణరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. భారత ప్రభుత్వరంగ బీమా సంస్థలో ఉద్యోగం చేసి, సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు. దాదాపు 30 ఏళ్లుగా కథలు రాస్తున్నారు. ఇప్పటివరకూ 225కు పైగా కథలు రాశారు. వీటిలో 70 కథలకు బహుమతులు అందుకున్నారు. పలు కథలు అన్ని ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ‘జాబిలి మీద సంతకం’, ‘నేలకు దిగిన నక్షత్రం’ పేరుతో కథా సంకలనాలు వెలువరించారు. ఆకాశంలో ఒక నక్షత్రం కథ.. ఇంగ్లీషు నాటకంగా రూపుదిద్దుకుంది. దేవుడిని చూసినవాడు, మంచుపల్లకి, దుర్గమ్మ కూతురు కథలు కన్నడంలోకి అనువాదం అయ్యాయి. ‘క్షమాభిక్ష’ కథకు స్వాతి మాసపత్రిక అనిల్‌ అవార్డు దక్కింది. 2020లో నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన కథల పోటీలో.. ‘పోలేరమ్మ’ కథ రూ.15000 బహుమతి గెలుచుకున్నది. వీటితోపాటు వివిధ కథలకు బహుమతులు, సన్మానాలు అందుకున్నారు.

 

Previous article

Ramaayanam |  స్కూల్‌ డే!

Next article


Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.