టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్ కు ఇవాళ(శనివారం) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు.
సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని వేల్స్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో ప్రకటించింది. “సినీ రంగంలో రామ్ చరణ్ విజయాలు స్ఫూర్తిదాయకం. చిత్రపరిశ్రమకు ఆయన సేవలు అపురూపం. సామాజిక సేవ పట్ల ఆయన నిబద్ధత అచంచలం. సమాజంపై సానుకూల ప్రభావం చూపుతూ, లెక్కలేనంతమంది తమ కలలను సాకారం చేసుకునేందుకు రామ్ చరణ్ ప్రస్థానం ప్రేరణగా నిలుస్తుంది” అని వివరించింది.
శనివారం చెన్నైలో వేల్స్ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు ప్రతిష్టాత్మక చంద్రయాన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ పి.వీరముత్తువేల్, ట్రివిట్రాన్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు, సీఎండీ జీఎస్కే వేలు, తెలుగుతేజం, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, పద్మశ్రీ ఆచంట శరత్ కమల్ కూడా గౌరవ డాక్టరేట్ పట్టాలు పుచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..