మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆయా రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు ఈవో తెలిపారు. శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శదర్శనానికి అవకాశం ఉంటుంది. 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటలకు వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని ఇది వరకు వెండి రథంలోనే ఊరేగింపు ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. ఇటీవల నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వామి రూ.11 కోట్ల విలువ చేసే బంగారు రథాన్ని అందించారు. దీంతో ఇకపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను బంగారు రథంపై నిర్వహించనున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: డ్రైవర్ లేకుండానే 78 కి.మీ. ప్రయాణించిన రైలు
