
- ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) / చిక్కడపల్లి: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని సరుకుగా మార్చేందుకు సామ్రాజ్యవాదం ప్రయత్నిస్తోందని.. అందుకే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ప్రతిపాదించిందన్నారు. దేశంలో ఈ చట్టాల ప్రమాదాలు ఇంకా పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల రక్షణకు అప్రమత్తత అవసరమని మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్‌వీకేలో ‘మారుతున్న ప్రపంచ సంబంధాలు, వాతావరణం, జాతీయ వ్యవసాయ విధానాలు, వానాకాలం పంటల సాగు’ అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ప్రబాత్ అన్నారు. ఫౌండేషన్ మేనేజ్‌మెంట్ ట్రస్టీ అరిబండి ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అఖిల భారత కిసాన్‌సభ జాతీయ సెక్రటరీ జనరల్ విజోకృష్ణన్, వ్యవసాయ నిపుణుడు అల్ధాస్ జానయ్య, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, ఏఐకేఎస్ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లార్డి తదితరులు పాల్గొన్నారు.
