ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ప్రధాని సముద్ర గర్భంలోకి వెళ్లి ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటిఅడుగుభాగాన ఉన్న ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ద్వారకలో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన కేబుల్ సపోర్టు బ్రిడ్జి సుదర్శన్ సేతును ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన నగరంగా పేరు పొంది సముద్రగర్భంలో మునిగిపోయిన ద్వారకను మోదీ సందర్శించారు.
డైవింగ్ ఎక్స్ పర్ట్స్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసిన మోదీ సముద్రగర్భంలో ద్వారకను సందర్శించారు. కాగా మనదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంగా ద్వారకను పేర్కొంటారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న సముద్రగర్భంలోని ద్వారకను ప్రధానిమోదీ నెమలి పింఛాలను, పూజా సామాగ్రిని తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. అంతకుముందు ప్రధాని ద్వారకాధీష్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయంలో కాషాయం దుస్తులు ధరించి..మూడు నామాలు పెట్టుకుని హిందుత్వాన్ని చాటిచెబుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Dwarka Darshan under the waters…where the spiritual and the historical converge, where every moment was a divine melody echoing Bhagwan Shri Krishna’s eternal presence. pic.twitter.com/2HPGgsWYsS
— Narendra Modi (@narendramodi) February 25, 2024
ద్వారకకు వచ్చే భక్తులకు ప్రధాని మోదీ భారీ కానుకను అందజేశారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని జెట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రారంభించారు. సుమారు రూ. 980కోట్లతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి పొడవు 2.32 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జి. ఈ వంతెనను భగవద్గీత శ్లోకాలు, శ్రీ కృష్ణుడి పాత్రతో ఎంతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతోపాటుగా వంతెనపై సోలార్ ప్యానెల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. మోదీ ద్వారక పర్యటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
