Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

హికికొమోరి… కొత్త మహమ్మారి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 24, 2024No Comments

తన పేరేదైతేనేం. కాసేపు మీకు నచ్చిన పేరే పెట్టుకోండి. తనది ఓ అందమైన జీవితం. చూసేవారికి అసూయ కలిగించే కెరీర్‌. ఏ మజిలీలోనూ వెనకబడింది లేదు. స్కూల్‌, కాలేజ్‌ చదువులను అలవోకగా దాటేశాడు. ఎంట్రెన్స్‌ టెస్టుల్లో టాప్‌ ర్యాంకులు సాధించాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

March 24, 2024 / 03:07 AM IST
హికికొమోరి… కొత్త మహమ్మారి

తన పేరేదైతేనేం. కాసేపు మీకు నచ్చిన పేరే పెట్టుకోండి. తనది ఓ అందమైన జీవితం. చూసేవారికి అసూయ కలిగించే కెరీర్‌. ఏ మజిలీలోనూ వెనకబడింది లేదు. స్కూల్‌, కాలేజ్‌ చదువులను అలవోకగా దాటేశాడు. ఎంట్రెన్స్‌ టెస్టుల్లో టాప్‌ ర్యాంకులు సాధించాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. ఆఫీసులో తన మాటకు తిరుగులేదు. ఎంత క్లిష్టమైన ప్రాజెక్ట్‌ అయినా తనే ఆపద్బాంధవుడు. దేవుడు అడిగితేనే వరం ఇస్తాడని అంటారు. కానీ తనకు అడక్కుండానే, ఒకదాని తర్వాత మరొకటిగా వరాలూ ఇస్తున్నట్టే కనిపిస్తుంది. అలాంటిది… తను అకస్మాత్తుగా తన స్నేహితులతో మాట్లాడటం మానేశాడు. మొహాన నవ్వు లేదు. పలకరిస్తే జవాబు సరిగా రాదు. ఇంకొన్నాళ్లకు ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేశాడు. ఇంటికి వెళ్లినవాళ్లకు, తను గదిలోంచి బయటికి వచ్చి కనిపించడు. ఏం జరిగిందని అడిగితే కుటుంబసభ్యుల దగ్గరా సరైన జవాబు లేదు. ఇంతకీ తను… ఒంటరితనాన్ని ఎంచుకున్నాడు. తనలోకి తనే కూరుకుపోతున్నాడు. సమాజం నుంచి దూరమైపోతున్నాడు. తన పేరేదైనా కానీ. ఒక్కడు మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కోవడం లేదు. ఈ నిర్బంధ ఒంటరితనం కోట్లాదిమంది ఎంచుకుని తగిలించుకుంటున్న పంజరం. హికికొమోరి అనే ఓ జపనీస్‌ ట్రెండ్‌ ఆధారంగా,
మహమ్మారిలా మారుతున్న ఒంటరితనం గురించి మాట్లాడుకునే ప్రయత్నమిది!

ఏకాంతం ఓ ఔషధం. మన ఆలోచనల తీరును గమనించేందుకు, చుట్టూ జరుగుతున్నది విశ్లేషించేందుకు. కానీ ఒంటరితనం ఓ విషాదం. ఎక్కడ ఉన్నా ఇమడలేని ఇరుకుదనం. ఇదేమీ కొత్త కాదు. మనిషి సంఘజీవిగా మారినప్పటి నుంచీ ఎవరో ఒకరిలో కనిపించే సమస్యే. అయితే అప్పటి కారణాలు సహజమైనవి. పరాయిదేశంలో తనది కాని జీవనశైలి మధ్య ఇమడలేకపోవడం, మనసుకు దగ్గరైన బంధాలు విచ్ఛిన్నం కావడం, ఆత్మీయులు చనిపోవడం, ప్రసూతి వైరాగ్యం లాంటి కుంగుబాట్లు, జన్యువులు… ఇందుకు ముఖ్య కారణంగా ఉండేవి. ఇప్పటి పరిస్థితి వేరు. ఇది ఆధునిక జీవితపు సైడ్‌ ఎఫెక్ట్‌. నానాటికీ పెరుగుతున్న మహమ్మారి. అందుకే గత ఏడాది అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి దీన్నొక మహమ్మారిగా వర్ణించారు. ‘పొగాకు, ఊబకాయం, డ్రగ్స్‌ లాంటి ఆరోగ్య సమస్యల విషయంలో మనం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామో… ఒంటరితనం గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒంటరితనాన్ని నివారించిన రోజే మరింత ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం’ అని ఆయన కుండ బద్దలు కొట్టేశారు.

ఒంటరితనానికి టెస్ట్‌ కేస్‌- హికికొమోరి
ఒంటరితనం అనుభవించని మనిషంటూ ఉండడు. ఏదో ఒక సందర్భంలో… బాధలోనో, అనారోగ్యంతోనో, ఎడబాటు వల్లో, వైఫల్యం కారణంగానో ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. అయితే ఆ భావన నిరంతరాయంగా ఉంటూ మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే మాత్రం దీర్ఘకాలిక సమస్యగానే భావించాలి. ఈ ఒంటరితనంతో కుటుంబం, దేశం, ఆ మాటకు వస్తే సమాజం ఎంతలా అతలాకుతలం అవుతాయో తెలుసుకునేందుకు ఒకసారి అలా జపాన్‌కు వెళ్లి రావాలి. చైనా నుంచి కొవిడ్‌ మొదలైతే, దాని పొరుగు దేశమైన జపాన్‌ నుంచి ఒంటరితనం అనే మహమ్మారి ప్రచారంలోకి వస్తున్నది. దానికి అక్కడి ప్రజలు పెట్టుకున్న పేరు హికికొమోరి! నిజానికి జపాన్‌ అంటే లోకం మొత్తానికీ ఓ అబ్బురం. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ జోన్‌లో ఉండటం వల్ల అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

ఆ అలజడుల వల్ల అక్కడి అగ్నిపర్వతాలు కూడా నిప్పులు కక్కుతుంటాయి. వీటన్నింటినీ దాటుకుని ఎదుగుతున్న దేశం మీద పిడుగులా అణుబాంబు పడింది. పంచభూతాల స్థానంలో మంటలే రాజ్యమేలిన ఆ పరిస్థితిని కూడా జపాన్‌ అధిగమించింది. కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో నిలదొక్కుకుంది. ఎటు చూసినా, ఎవరికైనా తనే ఆదర్శంగా తోచింది. మేనేజ్‌మెంట్‌ పాఠాలు నేర్చుకోవాలంటే ఆ దేశమే, జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి అంటే అక్కడి జీవనశైలే! 2000 సంవత్సరం నాటికి పరిస్థితి మారిపోయింది. లోకాన్ని మెప్పించడంలోనూ, కెరీర్‌ పరుగులు తీయడంలోనూ జపనీయులు ఎక్కడో తమను తాము మర్చిపోయేంతగా దారితప్పారని అర్థమైంది. అది హికికొమోరి ద్వారా బయటపడటం మొదలైంది.

హికికొమోరి – ఏమిటీ కిరికిరి

Sleep

ప్రముఖ సైకాలజిస్ట్‌ అయిన సైటో తమాకి, తన పుస్తకంలో మొదటిసారి ఈ పదాన్ని వాడారు. హికికొమోరి అంటే జపనీస్‌ భాషలో ‘సమాజం నుంచి ఒంటరిగా ఉండటం, తనలోకి తాను పారిపోవడం’. ఒక ఆరు నెలలపాటు పనికో, చదువుకో వెళ్లకుండా గదిలోనే ఉండిపోయేవారు ఈ హికికొమోరి బాధితులు అని సాక్షాత్తు అక్కడి ఆరోగ్య శాఖే ప్రకటించింది. అంతేకాదు! ఈ సమస్యలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా అక్కడి సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా సమాజం నుంచి దూరం జరగడం, షాపింగ్‌ లాంటి రోజువారీ పనులకు కూడా బయటికి వెళ్లకపోవడం, మిత్రులకు దూరం కావడం, మాట్లాడటం తగ్గించేయడం, నలుగురూ కలుసుకునే సందర్భాలను తప్పించుకోవడం, నిరంతరం దిగాలుగా కనిపించడం… హికికొమోరిలో కచ్చితంగా కనిపించే లక్షణాలు. ఇది ఉన్న పిల్లలు బడికి వెళ్లరు, పెద్దలైతే ఉద్యోగానికి రాజీనామా కూడా చేసేయవచ్చు. ఈ సమస్య జపాన్‌లో ఎంత తీవ్రంగా ఉందీ అంటే స్వయంగా ప్రభుత్వమే హికికొమోరి ఒక సామాజిక సమస్య అని ఒప్పుకొని లెక్కలు కట్టింది. ఆ గణాంకాల ప్రకారమే జపాన్‌లో దాదాపు 15 లక్షల మంది హికికొమోరి గుప్పిట చిక్కుకున్నారు. ఇక అనధికారికంగా ఆ సంఖ్య ఇంకెంత ఉంటుందో!

కారణాలు స్పష్టం!
ఒంటరితనానికి సహజంగానే కొన్ని మానసిక వ్యాధులు కారణం అవుతాయి. పరిస్థితుల వల్ల మనసు కుంగిపోవచ్చు. మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌, ఆటిజం లాంటి ఎన్నో రకాలైన మానసిక రుగ్మతలు ఇందుకు దారితీయవచ్చు. కానీ ఆధునిక జీవనశైలిలోని లోటుపాట్లు ఇందుకు కారణమని గుర్తించి, జాగ్రత్తపడాల్సిన విషయమిది.
చదువు : జీవితంలో ఎదగాలి అంటే బాగా చదవాలి. పడీపడీ చదవాలి. ఇదీ జపాన్‌లో విద్య పరిస్థితి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అక్కడి పిల్లలు మరింత సమర్థులుగా మారేందుకు వారు ఎంచుకున్న ఆయుధం చదువే.

నర్సరీ నుంచే పిల్లలు బాగా చదువుకోవాలి, ఇతరులకంటే మెరుగైన ర్యాంకులు తెచ్చుకోవాలనే ఒత్తిడి ఉంటుంది. ఇది ఏదో ఒక దశలో ఆగేది కాదు. మంచి యూనివర్సిటీలోనో, కోర్సులోనో చేరాలంటే… అక్కడా కఠినమైన ప్రవేశ పరీక్షలు దాటాల్సి ఉంటుంది. దాంతో పిల్లలు, టీనేజర్ల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటున్నది. దీంతో ఏటికేడు వారిలో హింసాత్మక ధోరణులు కనిపిస్తున్నాయనే నివేదికలూ వినిపిస్తున్నాయి. ఈ వాతావరణాన్ని తట్టుకోలేక ఏదో ఒక సందర్భంలో వారు హికికొమోరి బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని కాస్త చల్లబరచడానికి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. సిలబస్‌ తగ్గిస్తూ, సెలవులను పెంచుతూ వారికి ఉపశమనం కలిగించాలనుకుంది. కానీ తల్లిదండ్రులు పట్టు వదలడం లేదు. ‘జుకు’ అని పిలుచుకునే ప్రత్యేక అకాడమీల్లో పిల్లలను చేర్చి వారికి ఖాళీ సమయం లేకుండా అతి జాగ్రత్తపడుతున్నారు.

బొమ్మరిల్లు పెంపకం : తన పిల్లవాడిని వెనక ఉండి నడిపించాలి. వాడు ఏం మాట్లాడాలి, ఏం చదవాలి… ఆఖరికి ఎలా ఆలోచించాలో కూడా తనే గైడ్‌ చేయాలి. ఈ తరహా పెంపకం జపాన్‌లో పెరిగిపోయింది. పోటీతత్వం, చిన్న కుటుంబాల వల్ల ఈ శాసనానికి అడ్డులేకుండా పోతున్నది. ఇలా ప్రవర్తించే తల్లిదండ్రులకు జపాన్‌లో క్యోకి మామా అని పేరు. ఇది జపాన్‌కే పరిమితం కాదు. చైనాలో టైగర్‌ మదర్‌ అనీ, అమెరికాలో స్టేజ్‌ మదర్‌ అనీ అంటారు. మన దేశంలో ప్రత్యేకమైన పేరైతే లేదు కానీ అదే పరిస్థితి ఉంది. ఈ నిరంతర సంకెళ్ల వల్ల పిల్లలకు ఊపిరి ఆడటం లేదు. తమదైన వ్యక్తిత్వం, నిర్ణయ సామర్థ్యం, సామాజిక నైపుణ్యాలు పూర్తిగా కొరవడి జీవితం మీద విరక్తిని కలిగిస్తున్నాయి.

ఆగని పరుగు : బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక కూడా ఒత్తిడి తీరడం లేదు. రిసెషన్‌, కొవిడ్‌, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితుల వల్ల ఉద్యోగ రంగం తీవ్రమైన ఒడుదొడుకుల మధ్య ఉంటున్నది. అందులో నిలదొక్కుకోవాలంటే నిరంతరం తనను తాను నిరూపించుకుంటూ ఉండాలి. స్వగృహం అనే సెంటిమెంటు కోసం ఆకాశాన్నంటుతున్న ఇళ్లను కొనే ప్రయత్నం చేయాలి. ఈ పోరు ఏదో ఒక సమయంలో మనసును విరిచేస్తున్నది.

సామాజిక మాధ్యమాలు : 1990ల్లో World Wide Web మొదలయ్యాక ఈ హికికొమోరి లాంటి ఒంటరితనపు సమస్యలు విస్తరించడం యాదృచ్ఛికం ఏమీ కాదు. వీడియో గేమ్స్‌ ఆడే వ్యసనాన్ని ఇప్పటికే International Classification of Diseases జాబితాలోకి చేర్చారు. ఇక డిజిటల్‌ అడిక్షన్‌ని చేర్చడమే తరువాయి. చిన్నతనం నుంచే స్క్రీన్లకు అతుక్కుపోతున్న తరంలో సహనం పాళ్లు తగ్గిపోతున్నాయనీ, విశ్లేషణ సామర్థ్యం అడుగంటుతున్నదనీ, జీవన నైపుణ్యాలనేవే ఉండటం లేదని పరిశోధకులే ఒప్పుకొంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా కేవలం ఇతరుల విలాసాలనీ, విజయాలనీ, సుఖసంతోషాలనీ గమనిస్తూ… న్యూనతలోకి, పోలికలోకీ జారిపోతున్నారు. హికికొమోరిలోకి జారిపోయిన తర్వాత కూడా నాలుగు గోడల మధ్య కాలం గడిచిపోవడానికి కూడా ఇంటర్నెట్‌ ఉపయోగపడుతున్నది.

పరిష్కారాలేమిటి?
హికికొమోరి లేదా ఒంటరితనాన్ని సూచించే ఏ పేరైనా సరే… వాటిని తప్పించుకునేందుకు ముఖ్యమైన సూచనలు కొన్ని తరచూ వినిపిస్తూనే ఉంటాయి! అవి… ఆత్మీయులతో మాట్లాడటం, మనసును సేదతీర్చే వ్యాపకం ఏదన్నా ఏర్పరుచుకోవడం, శరీరంతోపాటు మనసును కూడా తేలికపరిచేలా వ్యాయామం చేయడం, ప్రయాణించడం లాంటివి. ఇక మన చుట్టూ ఎవరన్నా సుదీర్ఘకాలంపాటు ఇలాంటి లక్షణాలతో కనిపిస్తుంటే, వారితో మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయడం, అవసరం అనుకుంటే మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్లడం లాంటివి పాటించాల్సిందే. కానీ సామాజికంగా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒంటరితనం వ్యక్తిగత సమస్య కాదనీ, మారుతున్న జీవనశైలికి ఏర్పడిన ఓ బై ప్రొడక్ట్‌ అనీ తేలిపోయింది కదా! కాబట్టి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం చేయాలి. ఒంటరితనం ఓ మహమ్మారిలా మారుతున్నదని హెచ్చరించిన అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి తన నివేదికలోనే అందుకోసం కొన్ని సూచనలు కూడా చేశారు.

  • మనిషి ఒంటరిగా తన ఇంట్లోనే ఉండిపోకుండా బయటికి వచ్చి సమాజంతో కలిసే విధంగా పార్కులు, గ్రంథాలయాలు, ఆటస్థలాలు లాంటి వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఒంటరితనాన్ని కూడా ఓ అనారోగ్యంగా పరిగణించి, ఆ సమస్యతో బాధపడేవారితో ఎలా వ్యవహరించాలో పటిష్ఠమైన ప్రణాళికలు ఏర్పరుచుకోవాలి.
  • ఉద్యోగులు కుటుంబంతో కాలం గడిపేందుకు, వారితో కలిసి యాత్రలకు వెళ్లేందుకు కంపెనీలు ఉచిత ప్రయాణాలు, పెయిడ్‌ లీవ్స్‌ మంజూరు చేయాలి.
  • డిజిటల్‌ పరికరాలు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, వాటికి పరిమితులు విధించడం ఎలా అనే విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి.
  • ప్రతి సమాజంలోనూ నలుగురూ కలుసుకునేందుకు కొన్ని సందర్భాలు ఉంటాయి. వాటిని విస్మరించకూడదు.

ఈ ప్రశ్నలకు బదులేంటి?

Sleep1

హికికొమోరి ఒక వ్యక్తిగత సమస్య కానే కాదు. దానివల్ల దేశ ఉత్పాదక శక్తి దెబ్బతింటుంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. ఇక కుటుంబ వ్యవస్థ గురించి చెప్పనక్కర్లేదు. యుక్తవయసులో ఈ వ్యాధిన పడితే, వారిని తల్లిదండ్రులు భరించడం కష్టమైపోతుంది. నడివయసులో వస్తే… ఇటు పిల్లలూ, అటు వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. దీనికి ఏకంగా ‘80-50 ప్రాబ్లం’ అని పేరు కూడా పెట్టారు. ఎవరైనా ఈ హికికొమోరి లేదా ఒంటరితనం బారిన పడ్డారేమో తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. పైన చెప్పుకొన్నట్టుగా కొన్నాళ్లపాటు ఎవరైనా సరే సాటి మనుషులకు, బాధ్యతలకు, సామాజిక బంధాలకు దూరంగా ఉంటే ఒంటరితనంతో కుంగిపోతున్నట్టే. హికికొమోరి సమస్యను తెలుసుకోవడానికి నిపుణులు రూపొందించే ప్రశ్నావళులు ఉపయోగకరంగా ఉంటాయి. అవి…

  • మీ చుట్టూ ఉన్నవారికి దూరంగా ఉండాలని అనిపిస్తున్నదా?
  • మనసులో బాధ చెప్పుకోవాలి అనుకున్నప్పుడు, ఎవరూ లేరనిపిస్తున్నదా?
  • ఒంటరిగా కాలం గడపాలనే ఆలోచన వస్తున్నదా?
  • మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నారా?
  • కొత్త వ్యక్తులను కలవడం ఇబ్బందిగా ఉంటున్నదా?
  • నలుగురూ ఉన్నచోట నిలబడటం అసాధ్యంగా తోస్తున్నదా?

ఈ ప్రశ్నలకు ఎన్నిసార్లు అవుననే
సమాధానం వస్తే… మనలో ఒంటరితనం అంత ఎక్కువగా ఉన్నట్టు. అశ్రద్ధ చేయకుండా మిత్రులతో మన సమస్యను పంచుకోవాల్సిందే. అక్కడా సాంత్వన లభించకపోతే వైద్యుడిని సంప్రదించాల్సిందే!

ఆరోగ్య సమస్యలు
స్టీవ్‌ కోలె అనే పరిశోధకుడి ప్రకారం ఒంటరితనం అనేది అనారోగ్యానికి ఎరువు లాంటిది. ఒంటరిగా ఉన్నప్పుడు మెదడు దాన్ని గ్రహిస్తుంది. ఏదో కోల్పోతున్నామంటూ హెచ్చరికలు పంపిస్తుంది. చటుక్కున 15 సిగరెట్లు తాగితేనో, ఆకలిదప్పికలను పట్టించుకోకుండా ఉంటేనో… ఎలాంటి దుష్ప్రభావం కలుగుతుందో ఒంటరితనం వల్ల అంతే చెడు జరుగుతుందట.

  • డిప్రెషన్‌, వ్యసనాలకు లోనవడం, నిద్ర పట్టకపోవడం, తనకు తాను హాని కలిగించుకోవడం (సెల్ఫ్‌ ఇంజరీ), ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు… లాంటివి ఒంటరితనానికి అనుబంధంగానే కనిపిస్తాయి.
  • మనుషులకు సంతోషాన్ని, సంతృప్తిని అందించే డోపమైన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి ఒంటరితనపు భావనతో తగ్గిపోతుంది.
  • ఒత్తిడి సమయంలో ఏర్పడే కార్టిజాల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి, ఒంటరితనంలో పెరిగిపోతుంది. పెరిగిన కార్టిజాల్‌ స్థాయి
    వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా జీర్ణసమస్యలు, గుండెజబ్బులు, అధిక బరువు కలగవచ్చు.
  • మన శరీరంలో నేచురల్‌ కిల్లర్‌ (NK) అనే కణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. ఒంటరితనంలో వీటి ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల శరీరం త్వరగా వైరస్‌ల బారిన పడుతుంది.
  • ఒంటరితనం మెదడు మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా డెమెన్షియా (మతిమరపు) లాంటి సమస్యలు ఏర్పడతాయి.

విస్తరిస్తున్న హెచ్చరికలు
ఒంటరితనం ఓ కథనమో, జీవనశైలి విధానమో కాదు… అది వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి అని సూచించే గణాంకాలు చాలానే వినిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం యువతలో పదిశాతం, వృద్ధులలో 25 శాతం ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇది ‘ప్రపంచ సమస్య’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తేల్చేసింది. గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ కనెక్షన్స్‌ అనే మరో నివేదిక లోకంలో ఏకంగా 450 కోట్ల మంది తాము ‘ఒంటరి’గానో, ‘మరీ ఒంటరి’గానో భావిస్తున్నారని తెలిపింది. కొవిడ్‌ సమయంలో ఈ ఒంటరితనపు సమస్య మరీ ఎక్కువైపోయిందనీ, ఆ తర్వాత స్థిరపడిపోయిందనీ అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ తేల్చి చెప్పింది.

జీవితం అంటే పరుగుపందెం కాదు, విజయం అంటే ఇతరులను ఓడించడమూ కాదు, సంపద అంటే సంపాదనే కాదు…
మరి అలా కాక ఇంకేమిటి అన్న ప్రశ్న మనకు మనం వేసుకున్నప్పుడు తప్పకుండా భిన్నమైన జవాబులు వినిపిస్తాయి. వాటికి కూడాకాస్త ప్రాధాన్యం ఇస్తే హికికొమోరి లాంటి సమస్యలు రానేరావు.

…? కె.ఎల్‌. సూర్య

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.