
అమీర్‌పేట్, జనవరి 16 : రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి వద్ద లభించిన నగదును నిజాయితీగా అప్పగించారు 108 ఆంబులెన్స్ సిబ్బంది. సోమవారం ఎర్రగడ్డ ఫ్లై ఓవర్‌పై ఓ బైక్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న 108 అత్యవసర సిబ్బంది ప్రమాదంలో గాయపడిన తిరుపతయ్య అనే బాధితుడికి ప్రథమ చికిత్స అందజేశారు. అదే సమయంలో అతడి వద్ద లభించిన రూ.68,500 నగదు, బైక్, సెల్‌ఫోన్‌లను తిరుపతయ్య బంధువులను పిలిచి అప్పగించారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసి, బాధితుడి వద్ద లభించిన నగదును అప్పగించిన 108 సిబ్బంది వెంకటేశ్, వెంకటరమణలను పలువురు అభినందించారు.
