బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 13వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

- ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్‌ఎస్
- ఒకటి రెండు రోజుల్లో వరంగల్ లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన
- కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ ఫోకస్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 13వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో పోలిస్తే ఈసారి భిన్నంగా ముందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధినేతతోపాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు.
ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌చేసేలా బస్సుయాత్ర చేస్తూనే అక్కడకక్కడా బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పటికే నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి.
ఒకట్రెండు రోజుల్లో..
వరంగల్ లోక్‌సభతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు పూర్తిచేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన గులాబీ దళపతి ఒకట్రెండు రోజుల్లో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది.
కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై ఫోకస్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అన్ని వర్గాలు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయి? వ్యవసాయ, పారిశ్రామికరంగాలు ఎలా నిర్వీర్యమవుతున్నాయి? కాంగ్రెస్ 120 రోజుల పాలన, కేంద్రంలో బీజేపీ పదేండ్ల పాలన రాష్ట్రం ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా ఎలా మారింది? వంటి అంశాలతో కేసీఆర్ ఎన్నిక ఎన్నికల రణక్షేత్రంలో దూకనున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రశ్నార్థకం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల నల్లగొండ, కరీంనగర్ సభల్లో కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. దక్షిణ, ఉత్తర తెలంగాణలలో నీళ్లు లేక ఎండిన పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నదాతకు ధైర్యం చెప్పారు.
కేసీఆర్ పొలంబాటే పోరుగీతం
రాష్ట్రంలో మరే పార్టీకి లేని బలమైన పునాది తమకు ఉన్నదని, అదే తమకు కొండంత అండ అని గులాబీదళం ధీమా ఉన్నది. మిగతా పార్టీలకు అవకాశవాద క్యాడర్ ఉంటే తమకు మాత్రం అంకుశంలాంటి క్యాడర్ ఉన్నదని కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన పొలంబాట కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మైస్థెర్యాన్ని నింపాయి. స్వార్థం చూసుకునే కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్లినా క్యాడర్ చెక్కుచెదరకుండా ఉన్నదని నల్లగొండ, కరీంనగర్ బహిరంగ సభలు, పొలంబాట కార్యక్రమాలు నిరూపించాయి. కేసీఆర్ నాలుగు నెలల్లో నాలుగుసార్లు ప్రజాక్షేత్రంలోకి వస్తేనే ప్రభుత్వం ఆగమాగం అవుతున్నదని, ఇక ఆయన నిత్యం ప్రజల్లో ఉంటే ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు.