ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

- వంద రోజులైనా హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను వేటాడుదాం
- బీజేపీ కోసం కాంగ్రెస్ మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో డమ్మీ అభ్యర్థులను పెట్టింది
- ఇప్పటికీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రేవంత్ మల్కాజిగిరిలో పోటీకి రా..!
- ఫోన్ ట్యాపింగ్‌పై పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్‌పై పెట్టాలి
- మేడిపల్లి సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్
మేడ్చల్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మేడిపల్లిలో బుధవారం జరిగిన సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
రూ.4వేల పింఛన్ ఎక్కడ?
100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలను నాలుగు నెలలైనా.. ఎందుకు అమలు చెయ్యలేదని ప్రశ్నించారు. కోటి 67 లక్షల మహిళలకు మహాలక్ష్మి పథకం అమలైందా..? ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరికి రూ.4 వేల పింఛన్ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా..? యువతకు ఏడాది 2 లక్షల ఉద్యాగాలు ఇస్తానన్నాడు.. ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు నేరవేర్చడం సాధ్యం కాదని రేవంత్‌రెడ్డికి ముందే తెలుసని, అందుకే ఎంత సేపూ.. ఈ స్కాం.. ఆ స్కాం.. అంటూ కాలం గడుపుతున్నట్లు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్‌పై పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.
ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాం
బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే తాగునీటి, కరెంట్ సమస్యలను పరిష్కరించామని కేటీఆర్ అన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్త మెడికల్ కాలేజీలు, గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓడిపోయినంత మాత్రన కుంగిపోయేది లేదని ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఏమి హామీలు అమలు చేయకపోయినా.. ప్రజలు మాకే ఓటు వేశారంటారని, మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తారని తెలిపారు.
లోకల్.. నాన్ లోకల్ మధ్య పోటీ
మల్కాజిగిరిలో మనకు బీజేపీతోనే పోటీ ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి ఏమైనా సహకరించిందా అని ప్రశ్నించారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓడిపోయిన తర్వాత హుజురాబాద్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డి ఓడిపోయి చేవెళ్లకు పోతుందన్నారు. పక్కాలోకల్ అయిన బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజిగిరి ప్రజలు గెలిపించి తెలంగాణ గొంతుకను వినిపించాలన్నారు. గులాబీ జెండా మాత్రమే మన ప్రాంత ప్రయోజనాలను కాపాడుతుందని గుర్తించాలని అన్నారు.
బీజేపీ వేస్తామన్న రూ.15 లక్షలు వచ్చాయా.?
కాంగ్రెస్ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్లు ఇస్తే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, రూ.2 వేల పింఛన్లు తీసుకుంటునోళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా రూ.4 వేల పింఛన్లు అందించలేదని మండిపడ్డారు. ప్రజల ఖాతాల్లో బీజేపీ వేస్తామన్న రూ.15 లక్షలు వచ్చినోళ్లు బీజేపీకి ఓటు వేయాలని రానోళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్నారు.
బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు
బీజేపీ కోసం కాంగ్రెస్ మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు డమ్మీ అభ్యర్థులను పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. చేవెళ్లలో పనికిరాని చెత్తను మల్కాజిగిరిలో పడివేశారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలా డమ్మీ అభ్యర్థులను పెట్టుకుని సహకరించుకుంటున్నారని, కరీంనగర్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ సవాలు చేస్తున్నా.. దమ్ముంటే మల్కాజిగిరిలో తనపై పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
బీఆర్‌ఎస్‌ను ఓడించాలని.. కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
బీఆర్‌ఎస్‌ను ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని నాలుగు నెలల్లోనే నాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో తెలంగాణ రాష్ట్రం మరో 10ఏండ్లు వెనక్కి పోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టి మల్కాజిగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బందు చేసిందన్నారు.
నేను పక్కా లోకల్.. ఆశీర్వదించండి
- ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
నేను పక్కాలోకల్.. మల్కాజిగిరి ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, మంద సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
హుజురాబాద్‌లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా?
- ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హుజురాబాద్‌లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా అని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజురాబాద్ ప్ర జలను మోసం చేసి మల్కాజిగిరికి ఈటల రాజేందర్ వస్తున్నట్లు చెప్పారు. 20 ఏళ్లు హుజురాబాద్ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ఒక్క రోజుకూడా బొట్టు పెట్టని ఈటల రాజేందర్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.