
సినిమా థియేటర్లలో ఆహార, శీతల పానీయాల విక్రయాలకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించే హక్కు సినిమా థియేటర్ల యజమానులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. థియేటర్ యాజమాన్యం నిర్ణయించిన ధరకే ప్రేక్షకులు వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు, ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది.
సినిమా థియేటర్లు ప్రైవేట్ ఆస్తి అని, థియేటర్ యజమానులు అలాంటి నిబంధనలను అమలు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. సినిమా థియేటర్లలోకి ప్రవేశించేటప్పుడు ఆయా సినిమాల యాజమాన్యాలు నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోర్టు ప్రేక్షకులకు సూచించింది.
మల్టీప్లెక్స్‌లో ఆహారపదార్థాల విక్రయం వ్యాపారమేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లను సందర్శించే వారు తమ సొంత ఆహారాన్ని తీసుకురావాలని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
