మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పొడిగింపులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ బహిరంగ సభకు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాంకిషన్‌రెడ్డి, గండ్రత్ ఈశ్వర్, బామిని రాజన్న, లోలం శ్యాంసుందర్, డాక్టర్ సుభాష్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
శుక్రవారం ముద్కేడ్ తాలూకాలోని పింపాల్ కౌటా, మెండ్కా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలు, యువకులు, వృద్ధులతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. దేశంలోని పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే బీఆర్ ఎస్ నేషనల్ పార్టీ ఆవిర్భవించిందని వెల్లడించారు. తెలంగాణలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, మేస్త్రీలు, చేనేత కార్మికులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు.
