తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇవాళ ప్రారంభించిన బడ్జెట్‌లో హోం మంత్రిత్వ శాఖ రూ. 9,599 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర పోలీసు శాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని గతేడాది ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నిఘాతో పాటు అత్యవసర పరిస్థితులు, ఇతర విపత్తుల సమయంలో వివిధ విభాగాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9,80,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమర్ధవంతమైన శాంతి భద్రతల నిర్వహణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడం వల్ల దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.
