
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జీవ ఎరువులను అందించేందుకు చర్యలు వేగవంతం చేశారు. వచ్చే నెలలో ‘మార్క్‌ఫెడ్ గోల్డ్’ పేరుతో బయో ఫెర్టిలైజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 40 కేజీల బ్యాగ్ ధర రూ. 700గా నిర్ణయించారు. ఇది వరి, మొక్కజొన్న, పత్తితో పాటు ఉద్యాన పంటలలో ఉపయోగించబడుతుంది.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విశ్వ ఆగ్రోటెక్ సహకారంతో దీనిని ఉత్పత్తి చేస్తున్నారు. మట్టిలో సేంద్రీయ కర్బనాన్ని పెంచడానికి, నేలను సారవంతం చేయడానికి మరియు పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక మిశ్రమాన్ని ఉపయోగిస్తారని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జీవామృతం వాడడం వల్ల పంటలకు చీడపీడల బెడద తప్పదని, అందువల్ల పురుగుమందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతుంది.
