రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని రేపు (ఆదివారం) సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్, సైఫాబాద్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తారు. ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబానీ పార్క్, నెక్లెస్ రోడ్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు సీపీ సిటీ ట్రాఫిక్ సుధీర్ బాబు తెలిపారు. వీఐపీల రాకను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని, పరిస్థితిని బట్టి వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా మళ్లిస్తామని తెలిపారు.
మరోవైపు ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్కులను మూసివేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ట్యాంక్ బండ్, తెలుగుతల్లి, బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మార్గంలో వాహనాలను లోనికి అనుమతించడం లేదని తెలిపారు. ఆర్టీసీ బస్సులను లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ మీదుగా మళ్లిస్తారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే వారి కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించారు. సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను తమ కార్లకు అతికించుకోవాలని సూచించారు.
