
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. నాగారం మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్ (50)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. అశోక్‌పై నలుగురు దుండగులు ఇంటి ముందే కత్తులతో దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపారు. స్థానికుల కేకలు వేయడంతో హంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్‌ను కుటుంబ సభ్యులు సమీపంలోని షైన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. హత్య జరిగిన ప్రాంతాన్ని మల్కాజిగిరి డీసీపీ జానకీ ధరావత్, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి పరిశీలించారు. అశోక్ హత్యకేసులో మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన బుగ్గ విజయ్ కుమార్ ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
