
కొడుకు చనిపోయాడని తల్లి బోరున విలపించింది. కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆమె కూడా గుండెపోటుతో మరణించింది. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్ (35)కి గతేడాది మే 15న హుస్నాబాద్‌లోని గోడగడ్డ కాలనీకి చెందిన శారదతో వివాహమైంది. గతేడాది సెప్టెంబరు 20న శారద తన పుట్టింటికి వచ్చి ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోవడంతో ఒంటరితనానికి గురైన శ్యామ్ రోజూ బాధపడేవాడు. నిన్న పెళ్లిరోజు కావడంతో మే 14వ తేదీ సాయంత్రం అత్తగారింటికి వెళ్లిన శ్యామ్ చెట్టుకింద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడలు, కొడుకు ఇద్దరూ చనిపోయారు. శ్యామ్ మృతదేహాన్ని నేదునూరు గ్రామానికి తీసుకెళ్లి సోమవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతలో.. శ్యామ్ తల్లికి రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొడుకు చనిపోయి 24 గంటలు గడవకముందే తల్లి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
