ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఓ సరుకు రవాణా రైలు పట్టాలు తప్పింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గుతో వెళ్తున్న సరుకు రవాణా రైలు ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడు గంటలు ఆలస్యమైంది. ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి ఉదయం 8.45 గంటలకు బయలుదేరుతుందని అధికారి తెలిపారు. దీనికి తోడు మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.
