హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి, పునర్నిర్మించిన ఐదు భవనాలకు అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మోజం జాహీ మార్కెట్‌లు “అందమైన ఆర్కిటెక్చర్‌కు అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డు”ను గెలుచుకున్నాయని సిఎం వివరించారు.
పర్యావరణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన లండన్‌లోని ప్రఖ్యాత “గ్రీన్ ఆర్గనైజేషన్” ఈ అవార్డులను ప్రదానం చేయడం తెలంగాణకు గర్వకారణమని సిఎం అన్నారు. దేశంలోనే ఈ హరిత పురస్కారాలు అందుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ, దేశ ఖ్యాతిని పెంపొందించిందని సీఎం అన్నారు.
నవతెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రపంచ ప్రమాణాలు, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణలో నూతన భవన నిర్మాణం, పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అందుకు ఈ అవార్డులే నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ప్రగతి పథంలో యావత్ దేశం పయనిస్తున్నదని, ఈ నేపధ్యంలో రాష్ట్రంలో అందరి సంక్షేమం కోసం ఆదర్శవంతమైన పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ నెల 16న లండన్ లో తెలంగాణకు ఈ అవార్డులను అందజేస్తున్న సందర్భంగా అందుకు కృషి చేసిన మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.
