సిద్దిపేట మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకుని అందరం కలిసి పనిచేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిద్దిపేటలో రూ.630 కోట్లతో ఐటీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ ఐటీ టవర్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 4000 మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు 5.6 బిలియన్లు. గడిచిన 9 ఏళ్లలో ఐటీ ఎగుమతులు 204.1 బిలియన్లకు చేరుకున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వచ్ఛ బడి సిద్దిపేట స్ఫూర్తితో ప్రతి జిల్లాలో స్వచ్ఛ బడి ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గాన్ని సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. సిద్దిపేటను మనమంతా ఆదర్శంగా తీసుకుంటామని… ఐటీ కేంద్రాన్ని మరింత విస్తరింపజేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
