2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం కనుమరుగవుతాయని, వాటిని కాపాడుకునే వారు ఏకం కావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం మాజీ ఎంపీ జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయని రాఘవులు తెలిపారు.
2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మరణశాసనంగా మారుతుందని అన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగానే ఈ నెల 23న బీహార్‌లో విపక్షాల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు సీపీఎం పార్టీ హాజరు కావాలని, తెలంగాణ నుంచి కూడా సీఎం కేసీఆర్ రావాలని కోరారు.
