ముంబై ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్‌లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగిస్తామని బెదిరించారు.
- ప్రజాపాలన లబ్ధిదారుల డాటా అమ్మకానికి?
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
- ప్రస్తుతం అన్ని అవసరాలకు ఆధారం అదే
- సైబర్ నేరగాళ్లకు చిక్కితే సామాన్యుడే బలి
- గతంలో 67 కోట్ల మంది డాటా అంగట్లో
- బట్టబయలు చేసిన తెలంగాణ పోలీసులు
ముంబై ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్‌లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగిస్తామని బెదిరించారు. నాకు సంబంధం లేదని, చీట్ చేస్తున్నారని బాధితురాలు గట్టిగానే మాట్లాడింది. మీరు ఆగండి.. మీ పేరు ఫలానా! మీరు ఉండేది హైదరాబాద్‌లో, కావాలంటే మీ ఆధార్ కార్డ్‌ను పంపిస్తామంటూ ఆమె సెల్‌ఫోన్‌కు ఆధార్‌కార్డును పంపించారు. ఆధార్‌కార్డును చూసి షాక్ అయిన బాధితురాలు ఏదో పొరపాటు జరిగిందని, కాపాడాలని వేడుకొన్నది. రూ.20 లక్షలు డిమాండ్ చేయటంతో, భయంతో వారి బ్యాంక్ ఖాతాలకు పంపింది. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
Aadhar | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఆధారే అన్నింటికీ ఆధారం. సాధారణ మనిషిని ఉగ్రవాదిగా, ఉగ్రవాదిని సాధారణ పౌరుడిగా చూపించవచ్చు. నకిలీ బ్యాంకు ఖాతాలు తెరవవచ్చు. దేశ సంపదనూ దోచేయొచ్చు. అలాంటి ఆధార్‌ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా కొన్ని చోట్ల జరిగే అలసత్వంతో ఆధార్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. దాంతో ప్రజలను మోసం చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డాటా అనేది అన్ని అవసరాలకు ప్రధానం. చిరు వ్యాపారం నుంచి కార్పొరేట్ వ్యాపారం వరకు అత్యంత ప్రభావితమైందీ డాటా.
డాటా చోరీపైనే గతంలో సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ, ఇతర నగరాల్లో దాడులు చేసి, దేశవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది డాటా చోరీకి గురయ్యిందని తెలిపారు. ఈ డాటాతోనే సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కోటి మందికిపైగా ప్రజాపాలన లబ్ధిదారుల డాటా కూడా అమ్మకానికి వెళ్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలుతో నకిలీ ఆధార్ తయారీ
- బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులకు బయోమెట్రిక్ వ్యవస్థను తీసుకొచ్చినా పకడ్బందీగా అమలు చేయడం లేదు. బినామీ ఆధార్ కార్డులను ఉపయోగించి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. సిమ్‌కార్డులు కొంటున్నారు. సేకరించిన ఆధార్‌కార్డులోని ఫొటోలు, డాటాను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకొని, నకిలీ ఆధార్‌కార్డులను తయారు చేస్తున్నారు.
- ఈ డాటాను సేకరించి ఉగ్రవాదులు ఫొటోలను మార్చేసి ఎక్కడైనా వెళ్లేందుకు అవకాశాలుంటాయి. ఎయిర్‌పోర్టుల్లోకి సైతం ఈ నకిలీ ఆధార్‌కార్డులను ఉపయోగించి వెళ్లే చాన్స్ ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, ఇతర సెక్యూరిటీ ప్రాంతాలలో వ్యక్తులకు సంబంధించిన గుర్తింపు కార్డులను ఆయా సంస్థలు అడుగుతుంటాయి. అక్కడ అక్కడ నకిలీ ఆధార్‌కార్డులను ఉపయోగించే ప్రమాదం లేకపోలేదు.
- ఏదైనా సంఘటన జరిగినప్పుడు దర్యాప్తు సంస్థలను పక్కదోవ పట్టించేందుకు నకిలీ ఆధార్‌కార్డులను సంఘటన స్థలంలో నేరగాళ్లు వదిలేయొచ్చు. అలా వదిలేసిన కార్డులతో అసలైన కార్డుదారుడు అనుమానితుడిగా మారుతాడు. ఏ పాపం చేయకుండానే అమాయకులు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
- నకిలీ ఆధార్ కార్డులతో బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ డెబిట్ కార్డులు కూడా తీసుకొనే అవకాశం ఉంటుంది. చాలా సంస్థలు బయోమెట్రిక్‌ను ఉపయోగిస్తున్నాయి. బయోమెట్రిక్ కోసం ఫింగర్ ప్రింట్స్ కూడా క్లోనింగ్ చేసే అవకాశాలున్నాయి. ఫలానా వ్యక్తి ఆధార్‌కార్డుతో అతని సంతకం ఉండే ఏదైనా డాక్యుమెంట్‌ను నేరగాళ్లు సేకరించి, దానిలోఉండే వేలి ముద్రల ఆధారంగా నకిలీ కార్డులు తయారు చేసే అవకాశం ఉంటుంది.
- బ్యాంకు ఖాతాలు, ఈమెయిల్ ఐడీలు, సోషల్‌మీడియా ఖాతాలతోనూ ఆధార్‌కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లింక్‌లు ఉంటాయి. ఇలా కూడా బ్యాంకు ఖాతాలను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే చాన్స్ ఉన్నది.
