ఒంటరిగా ఉన్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి వెళ్లిపోయి తర్వాత.. తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితుడితో కలిసి బాలికను చంపేద్దామని ఆమె ఇంటికి వెళ్లారు. ఎలాగూ హతమారుస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడి చంపేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకొంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్‌శివకిషోర్ వెల్లడించారు.
గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు ఈనెల 2న వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో ఆటో డ్రైవర్ పాంగి రమేశ్(19) ఆమెను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. బాలికను తీసుకెళ్లడం అక్కడే ఉన్న కొందరు చిన్నారులు చూశారు. కాసేపటికి రమేశ్ తనపై లైంగికదాడి చేసినట్లు బాలిక తన బంధువుకు చెప్పింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని రమేశ్ భయపడ్డాడు. తన స్నేహితుడైన మరో ఆటోడ్రైవర్ సీతన్నకు జరిగిందంతా చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు.
Read Also: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీకి షాక్
అందులో భాగంగా మొదట రమేశ్, కొంతసేపటి తర్వాత సీతన్న ఇంట్లోకి వెళ్లారు. ఎలాగూ ప్రాణాలు తీస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం చీరతో ఆమె గొంతు బిగించి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేలా బాలికను దూలానికి వేలాడదీసి పరారయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలు కనిపించాయి. తల్లిదండ్రులకు అనుమానం వచ్చినా మృతదేహాన్ని ఖననం చేశారు.
ఈనెల 5న గూడెంకొత్తవీధి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం పూర్తి చేశారు. దాంతో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితులిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతోపాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.
