తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతంగా కొనసాగుతోంది. ఆరు హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం బాగుందని కొంతమంది అంటుంటే.. మరికొంత మంది మాత్రం ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందని అంటున్నారు.
Read also: తెలంగాణ ఎమ్మెల్సీల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తాజాగా ఈ ఉచిత బస్సు పథకం పై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.10 వేల ఆదాయం ఉన్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారంటే అలాంటి మహిళలు తన దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వారని కించపరుస్తూ మాట్లాడారు. తమకు ఆదాయం, ఆస్తులు ఉన్నా కూడా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్నవారందరూ బిచ్చగాళ్లేనని అన్నారు. అంతేకాకుండా.. ఉచితం కావాలనుకునే వారికి ఉండాలి కానీ.. చెల్లించే సామర్థ్యం ఉన్న వారు కూడా ఉచిత బస్సు ప్రయాణం వాడుకుంటే.. నా దృష్టిలో అడుక్కుంటున్నట్టే అన్నారు. భగవంతుడు చిన్న చూపుచూడటంతో గుడి దగ్గర అమ్మా.. అయ్యా అంటూ అడుక్కుంటారు చూశారా వాళ్లలాగే మీరు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఆదాయం ఉండి కూడా పెన్షన్ తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా బిచ్చమెత్తుకున్నట్లే అంటూ మహిళలను తక్కువ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కోసం కక్కుర్తి పడేటోళ్లు శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్లతో సమానమని కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్ర వ్యతిరేకిస్తున్నారు. ‘నెలకు రెండున్నర లక్షలకు పైగా జీతం తీసుకుంటూ ప్రభుత్వ వాహనాన్ని వాడడం కూడా బిచ్చమెత్తుకున్నట్లే’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
