Sikandar Raza: అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు కూడా సాధ్యం కాని విధంగా వరుసగా ఐదు మ్యాచ్‌లలో అర్థ సెంచరీలతో కొత్త రికార్డును నెలకొల్పాడు జింబాబ్వే సారథి సికందర్ రజా.. జింబాబ్వే – శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు వేదికైంది.
Sikandar Raza: జింబాబ్వే క్రికెట్ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సారథిగా వ్యవహరిస్తున్న సికందర్ రజా టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు కూడా సాధ్యం కాని విధంగా వరుసగా ఐదు మ్యాచ్‌లలో అర్థ సెంచరీలతో కొత్త రికార్డును నెలకొల్పాడు. జింబాబ్వే – శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో.. 42 బంతుల్లో 62 పరుగులు చేయడంతో రజా.. వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గత ఐదు ఇన్నింగ్స్‌లలో రజా చేసిన స్కోర్లు.. 58, 65, 82, 65, 62గా ఉన్నాయి.
రజా గతేడాది ఐసీసీ నిర్వహించిన ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ (వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం) మ్యాచ్‌లలో భాగంగా నవంబర్‌లో రువాండా (58), నైజీరియా (65), కెన్యా (82) పై అర్థ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు.. తొలి మ్యాచ్‌లో 65 రన్స్ చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో రజా దురుసు ప్రవర్తన కారణంగా తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా లంకతో తొలి మ్యాచ్‌లోనే 62 పరుగులు చేసి నిలకడను మరోసారి చాటిచెప్పాడు.
Sikandar Raza has become the first person EVER to score 5 consecutive T20I fifties.
There is no doubting that this man is among the best in the world of cricket. pic.twitter.com/1CBLabqaw6
— Adam Theo🇿🇼🏏 (@AdamTheofilatos) January 14, 2024
అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో వరుసగా ఐదు మ్యాచ్‌లలో అర్థ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ రజా మాత్రమే. అంతకుముందు బ్రెండన్ మెక్‌కల్లమ్, క్రిస్ గేల్, క్రెయిగ్ విలియమ్స్, రయ్యన్ పఠాన్, గుస్టావ్ మెక్‌కఇయోన్, రీజా హెండ్రిక్స్‌లు వరుసగా నాలుగు అర్థ సెంచరీలు సాధించినవారిలో ఉన్నారు. అర్థసెంచరీలతో పాటు ఈ ఐదు మ్యాచ్‌లలో రజా.. బౌలింగ్‌లో కూడా కనీసం రెండు వికెట్లు తీయడం విశేషం. వరుసగా గత ఐదు మ్యాచ్‌లలో అతడి బౌలింగ్ ప్రదర్శన.. 3, 2, 2, 3, 3 గా నమోదైంది. వరల్డ్ క్రికెట్‌లో ఆల్ రౌండర్‌గా గుర్తింపుపొందుతున్న రజా.. జింబాబ్వే క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు.
