ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాకిచ్చింది. ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఈపీఎఫ్‌వో ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్‌ను తొలగించింది. ఉడాయ్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్‌వో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా.. ఆధార్ కార్డును ఇకపై ప్రాథమిక గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తామని తెలిపింది. ఉద్యోగుల జనన ధ్రువీకరణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదని ఈపీఎఫ్‌వో పేర్కొన్నది. ఈ మేరకు జనవరి 16న సర్క్యూలర్ విడుదల చేయగా, దానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తాజాగా ఆమోదం తెలిపారు. ఇటీవల పలు కేసుల్లో ఆధార్‌ను జనన ధ్రువీకరణ పత్రంగా లెక్కలోకి తీసుకోలేమని కోర్టులు తీర్పు వెలువరించాయి.
Read Also: పండుగకు కూతురి ఇంటికి వెళ్తున్న వృద్ధురాలి దారుణ హత్య
‘దేశ పౌరుడి నుంచి తీసుకున్న వివరాలతో ఆధార్ నంబర్ జారీ అవుతున్నది. ఇది కేవలం విశిష్ట గుర్తింపు సంఖ్య మాత్రమే. పుట్టిన తేదీని ప్రామాణీకరించటం దీంట్లో సాధ్యం కాదని ఆధార్ చట్టం, 2016 చెబుతున్నది. దీనిపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2018లో మెమోరాండం కూడా జారీచేసింది. దాంతో ఆధార్ కార్డు జనన ధ్రువీకరణకు ప్రామాణికం కాదు’ అని ఉడాయ్ తేల్చి చెప్పింది.
The post ఉద్యోగులకు షాకిచ్చిన ఈపీఎఫ్‌వో.. ఆధార్‌పై కీలక నిర్ణయం appeared first on tnewstelugu.com.
