పండుగకు కూతురి ఇంటికి వెళ్తున్న ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తి మండలం తర్నికల్కి చెందిన నాగమ్మ(60) అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగమ్మ ప్రస్తుతం తర్నికల్ గ్రామంలో కొడుకుల వద్ద ఉంటోంది. కూతురు ఉల్పరలో ఉంటుండటంతో.. మంగళవారం సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్లడానికి బయలుదేరింది. ఉల్పర వెళ్లేందుకు కల్వకుర్తి బస్టాండులో బస్సు కోసం వేచి ఉన్న సమయంలో నాగమ్మకు మాయమాటలు చెప్పి గుర్తుతెలియని వ్యక్తులు వెంట తీసుకెళ్లారు. అయితే నాగమ్మ మరుసటి రోజు కూడా కుమార్తె ఇంటికి చేరుకోపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఊళ్లన్నీ వెతికారు. జాడ తెలియకపోవడంతో బుధవారం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read Also: స్టేటస్ విషయంలో గొడవ.. మైనర్ బాలుడిని చంపిన మరో మైనర్
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దంపతులు నాగమ్మకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న నాగమ్మను తమతో తీసుకెళ్లి, కల్లు తాగించినట్లు నిందితులు తెలిపారు. అనంతరం ఆటోలో తీసుకెళ్లి నాగమ్మను హత్య చేసినట్లు అంగీకరించారు. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని, అచ్చంపేట సమీపంలోని నల్లమల అడవుల్లో మృతదేహానికి నిప్పటించినట్లు నిందితులు తెలిపారు. వారి సమాచారం మేరకు పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంగారు, వెండి ఆభరణాల కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇలాంటి మరో రెండు కేసులలోనూ నిందితులపై అనుమానాలున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మేకలతో పాటు పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
