తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావల వంతుకు మీంచి అమలు చేయలేరు. మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క పైసా నిధులు తేలేదు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలి.
మల్కాజ్గిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచాం. ఇపుడు కూడా ఎంపీ సీటు గెలవాలి. ఇది పరీక్షా సమయం. మల్కాజ్ గిరి మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి. కర్ణాటక లో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైంది. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయ్. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల కోడ్ లోపే కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి. కోడ్ బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోంది.
