ఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపించింది..అధికారంలోకి వచ్చిందని వాటిని అమలు చేయాలని బల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాణ పోరాడుతామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలో బుధవారం పర్యటించారు. రూ. కోటీ 15లక్షల నిధులతో పూర్తిచేసిన పలు డెవలప్ మెంట్ పనుల ప్రారంభోత్సవంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జాగిర్యాల్, పల్లికొండ, పిప్రి గ్రామాల్లో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్లు,రూప్లాతండా, దేవన్ పల్లి, లింగాపూర్ లో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ప్రజలే మనకు అండగా నిలబడ్డరు..వారి మనసులు గెలుచుకుందాం..!!
ఈ సందర్బంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి నిర్మించుకున్న గ్రామ పంచాయతీలు, హెల్త్ సబ్ సెంటర్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్యారెంటీల పేరుతో కొత్త సర్కార్ ఎన్నో ఆశలు చూపించిందన్నారు. ఎకరానికి రూ. 15వేల చొప్పున రైతుబంధు,రూ. 2లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని ప్రకటించారని..కానీ నేడు ఇంటింటికీ వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అంటూ మహిళలను మోసం చేస్తుందన్నారు. హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాణ పోరాటం తప్పదని హెచ్చరించారు.
