Zomato | ఇక నుంచి జోమాటో యూజర్లు యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకు జోమాటోకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జోమాటో (Zomato)’ అనుబంధ సంస్థ ‘జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Zomato Payments Private Limited – ZPPL) కు ‘ఆన్లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ (Onlile Payments Aggregator)’గా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆమోదించింది. ఈ విషయమై తమకు ఈ నెల 24న ఆర్బీఐ ఆథరైజేషన్ సర్టిఫికెట్ జారీ చేసిందని జోమాటో (Zomato) తెలిపింది. ఈ మేరకు ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. దీంతో యూజర్లు ‘జోమాటో’ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు.
ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ డిస్కవరీ సేవల నుంచి డిజిటల్ పేమెంట్స్ సేవల్లోకి జోమాటో విస్తరించనున్నది. టాటా పే (Tata Pay), రాజోర్ పే (Razorpay), క్యా్ష్ ఫ్రీ (Cashfree) యాప్స్‌తోపాటు డిజిటల్ పేమెంట్స్ సర్వీసు యాప్స్ జాబితాలో దీపిందర్ గోయల్ సారధ్యంలోని ‘జోమాటో’ కూడా వచ్చి చేరింది. యూపీఐ పేమెంట్స్ కోసం గతేడాది ఐసీఐసీఐ బ్యాంకుతో జోమాటో జత కట్టింది. తద్వారా సొంత యూపీఐ ‘జోమాటో యూపీఐ’ యాప్ ఏర్పాటు చేసింది. యూజర్ల కోసం క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు ఆర్బీఎల్ బ్యాంకుతోనూ జత కట్టినా.. తర్వాత కొంత కాలానికి వెనుకంజ వేసింది.
