పురిట్లోనే కవల పిల్లల్ని ఆ తండ్రి అమ్మేశాడు. అయితే తండ్రి వేరుచేసినా.. దేవుడు మాత్రం వారిని కలపాలనుకున్నాడు. అందుకే విడిపోయిన 19 ఏండ్ల తర్వాత కలిపాడు. ఈ విచిత్ర ఘటన జార్జియా దేశంలో చోటుచేసుకుంది.
గోచా గఖారియా, అజా షోని దంపతులు 2002లో తల్లిదండ్రులయ్యారు. అయితే అజా షోని ఇద్దరు కవలలకు జన్మనిచ్చే సమయంలో తీవ్ర అనారోగ్యకర పరిస్థితుల నడుమ కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో, తన కవల బిడ్డలను గోచా రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు. అనో సర్తానియా తిబ్లిసి ప్రాంతంలో పెరగగా, అమీ క్విటియా జుగ్దిది ప్రాంతంలో పెరిగి పెద్దదైంది. తాము కవలలం అని, చెరొక చోట పెరుగుతున్నాం అని వారిద్దరికీ ఏమాత్రం తెలియదు. 11 ఏళ్ల వయసున్నప్పుడు ఇద్దరూ ఓ డ్యాన్స్ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరిని చూసినవారు ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారే అని విస్మయానికి గురయ్యారు.
Read also: మేం తలచుకుంటే ఎన్నో కేసులు పెట్టి ఉండేవాళ్లం
ఆ తర్వాత జార్జియా గాట్ టాలెంట్ అనే టీవీ కార్యక్రమంలో అచ్చం తనలానే ఉన్న అనోని చూసి అమీ ఆశ్చర్యపోయింది. దాంతో అనో గురించి తెలుసుకోవాలన్న తపన అమీలో మొదలైంది. అనో కూడా సోషల్ మీడియాలో అమీ ఓ టిక్ టాక్ వీడియో చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. అచ్చం తనలాగే ఉన్న అమీ ఆడిపాడుతోంది. దాంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి అనోలో మొదలైంది. ఆ తర్వాత అనేక ప్రయత్నాల మీదట ఈ కవలలు తమ 19వ ఏట ఒకరినొకరు కలుసుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. జార్జియాలోని ఆసుపత్రుల్లో వేలాది మంది శిశువులు మాయం కావడం, పేదరికం కారణంగా పుట్టిన బిడ్డలను పురిట్లోనే అమ్ముకోవడం సాధారణమైన విషయం. అమీ, అనో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే తల్లి ఒడికి దూరమై చెరో ఇంట పెరిగారు.
