తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమలలో రథసప్తమి వేడుకలను నిర్వహిస్తారు. వేడుకల సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. మరోవైపు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉదయం 5.30 – 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం. ఉదయం 9 -10 గంటల వరకు చిన్నశేష వాహనం. ఉదయం 11 – 12 గంటల వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 – 3 గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4 – 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 – 7 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 8 – 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో విహరించనున్నారు.
Also Read.. అండర్-19 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచిన యువభారత్
