గ్రూప్ తగాదాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రెస్. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలెక్షన్స్ ఉన్నాయన్న ఒకే కారణంతో కాస్త సైలెంట్ గా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. లేదంటే వర్గపోరులతో తెలంగాణలో ఈ పాటికి అల్లర్లు తారస్థాయికి చేరేవి. అయితే తాజాగా ఖమ్మంలో బాహాబాహీకి దిగారు కాంగ్రెస్ నాయకులు. దాంతో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం రసాభాసగా ముగిసింది.
గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సన్మాన కార్యక్రమం నిర్వహించగా వివాదం నెలకొంది. ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే నారాయణరావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. పొంగులేటి వర్గీయులు మండల అధ్యక్షుడు వడ్డే నారాయణరావు అనుచరులపై దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరోమారు వర్గ పోరు బహిర్గతమైంది.
