పదో తరగతి స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ అందజేసే పథకానికి రేవంత్‌రెడ్డి సర్కారు ఎగనామం పెట్టింది.
- పదో తరగతి పరీక్షల వేళ సర్కారు కాఠిన్యం
- కడుపులు మాడ్చుకుని స్పెషల్ క్లాసులకు హాజరు
- 9 కోట్లతో స్నాక్స్ అందించిన కేసీఆర్ సర్కారు
- ఈ ఏడాది ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
- దాతల కోసం టీచర్ల వెదుకులాట
- చందాలేసుకుంటున్న ఉపాధ్యాయులు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): పదో తరగతి స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ అందజేసే పథకానికి రేవంత్‌రెడ్డి సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు కడుపు మాడ్చుకుని స్పెషల్ క్లాసులకు హాజరవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థుల బాధ చూడలేక కొన్ని పాఠశాలల్లో టీచర్లు, హెచ్‌ఎంలే తలా కొంత వేసుకుని స్నాక్స్ తెప్పిస్తున్నట్టు సమాచారం. మరికొన్ని స్కూళ్లల్లో దాతలు ముందుకొచ్చి అక్కడక్కడ చేయూతనందిస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. జనవరి నెల నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్పెషల్ క్లాసులు ఉంటాయి. దీంతో విద్యార్థులు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలల్లోనే గడపాల్సి వస్తున్నది. వీరికి మధ్యాహ్న భోజనం పెడుతున్నప్పటికీ ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ లేకపోవడంతో కడుపుమాడ్చుకునేవారు. కాలే కడుపులతో చదువుల మీద శ్రద్ధ పెట్టలేకపోయేవారు. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం నిరుడు స్నాక్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, మాడల్ స్కూళ్లలోని 1.89 లక్షల విద్యార్థులకు రూ.9.67 కోట్లు వెచ్చించి ఉచితంగా స్నాక్స్‌ను సమకూర్చింది. ఒక్కో విద్యార్థికి రోజుకు సగటున రూ.15 చొప్పున ఖర్చుచేసి వేడివేడి స్నాక్స్‌ను అందజేసింది. ప్రోటీన్లతో కూడిన ఉడికించిన శనగలు, బొబ్బర్లు, అనుములు, పల్లీలు-బెల్లంముద్దలు, ఉడికించిన కోడిగుడ్లు, సమోసాలు, పకోడి, అరటిపండ్లు వంటివి సమకూర్చింది. విద్యార్థులు ఉత్సాహంగా స్పెషల్ క్లాసులకు హాజరవ్వడంతో ఉత్తీర్ణతలో మంచి ఫలితాలొచ్చాయి. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది అటకెక్కించింది.
ఇదీ పరిస్థితి…
- సర్కారు స్నాక్స్‌ను బంద్‌పెట్టడంతో పిల్లల ఆకలితీర్చేందుకు అక్కడక్కడ దాతలు ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియోజకవర్గ పరిధిలోని పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ను సమకూర్చేందుకు తన వేతనంలో నుంచి కొంత విరాళంగా అందజేశారు.
- ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టతరాకపోవడంతో కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఉన్న ఆర్థిక వనరుల నుంచి రోజుకు రూ.10తో అటుకులు, ఉప్మా వంటి వాటిని అల్పాహారంగా అందించేందుకు విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుంటున్నారు.
- హైదరాబాద్‌లో హిల్‌స్ట్రీట్ పాఠశాలలో 43 మంది పదో తరగతి విద్యార్థులుండగా, ప్రస్తుతం టీచర్లే తలా కొంత వేసుకుని స్నాక్స్‌ను అందిస్తున్నారు.
- ఆదిలాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ గుడిహత్నూర్‌లో 25 మంది విద్యార్థులుండగా.. వీరంతా కడుపుమాడ్చుకునే స్పెషల్ క్లాసులకు హాజరవుతున్నారు. దాతలు ముందుకు రావాలని గణతంత్ర దినోత్సవంనాడు గ్రామ ప్రజలను కోరినా ఎవరూ ముందుకురాలేదు.
- చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 53 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. వీరికి స్నాక్స్‌ను అందజేయకపోవడంతో కడుపుమాడ్చుకునే క్లాసులు వింటున్నారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్నది.
