కొందరు సైబర్ నేరగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదలకుంగా..మోసాలకు తెగబడుతూనే ఉన్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మంచికి ఉపయోగించాల్సిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారు. అలా ఇన్‌స్టా గ్రాం ద్వారా నకిలీ వెబ్‌సైట్ లింక్ పంపి ఓ నిరుద్యోగ యువతి నుంచి నగదు కాజేశారు సైబర్ నేరగాళ్ళు. ఈ ఘటనపై నిన్న(గురువారం) కేసు నమోదైంది. నిజాంపేటకు చెందిన పత్తి నవ్యశ్రీ బీటెక్ పూర్తి చేసింది. ఈ నెల 2న ఆమె ఇన్‌స్టాగ్రాంకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ జాబ్ లింక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పంపారు. దాన్ని తెరిచి టాస్క్ ప్రారంభించాలని మొబైల్ లో మెసేజ రావడంతో ఆమె లింక్ ఓపెన్ చేశారు. డబ్బులు పంపితే అంతకంటే ఎక్కువ మొత్తం తిరిగి వస్తుందని మొబైల్ లోవచ్చిన మెసేజ్ సెండ్ చేసి యువతిని నమ్మించారు. నిజమే అని భావించిన యువతి తన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి ఏడు దఫాలుగా మొత్తం రూ.91,100 పంపారు. చివరకు అనుమానం వచ్చి తాను పంపిన డబ్బులు తిరిగి పంపాలని కోరగా రూ.83 వేలు పన్ను చెల్లిస్తే సొమ్ము తిరిగి ఖాతాలోకి వస్తాయని ఆ వ్యక్తులు సమాధానమిచ్చారు. దీంతో తాను మోసపోయినట్లు నిర్ధారించుకున్న బాధితురాలు అదే రోజు సైబర్ క్రైం 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. గురువారం స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇది కూడా చదవండి:రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి..భారీగా పడిపోయిన ధరలు..!!
The post ‘వర్క్ ఫ్రమ్ హోం’ మెసేజ్ లింక్ పై క్లిక్ చేసారో ఇక అంతే appeared first on tnewstelugu.com.
