కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతామని అంటోంది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ… గేమ్ చేజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుతోందన్నారు. శాసన మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. కానీ దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. ఆశా వర్కర్ల జీతాలను రూ. 18 వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని కూడా బడ్జెట్ లో ప్రస్తావించలేదు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందన్నారు.
మధ్యంతర బడ్జెట్ లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు దారి చూపిస్తుందని భావించామని తెలిపారు. కానీ మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని స్పష్టం చేశారు. కేటాయింపులు ముఖ్యం కాదని, ప్రభుత్వ ధృక్పథం బడ్జెట్ ను సూచిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.
మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడిందని, ఇమాంలకు, మోజమ్లకు రూ. 10 వేలు ఇస్తామని, పిల్లల కోసం తౌఫే తాలిమ్ ను మొదలుపెడుతామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో చేర్చి బడ్జెట్ లో విస్మరించిందని విమర్శించారు కవిత. మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూక్ష్మ స్థాయి హామీల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు. పేర్లు, చిహ్నాలు మార్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత హామీల అమలుకు కేటాయింపులు చేపట్టడానికి ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్తు కోత లేకపోయేదని, కానీ ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలోనే ప్రతి రోజూ 3 నుంచి 4 గంటల పాటు కరెంటు పోతోందన్నారు.
ఇది కూడా చదవండి:సీఎం రేవంత్ మన సంస్కృతిని అవమాన పర్చేలా మాట్లాడుతున్నారు
The post కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుందే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు appeared first on tnewstelugu.com.
