బెంగళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ రోడ్డు దగ్గర ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సయ్యద్ షఫీ అనే 28 ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా కనిపించాడు. స్కూటర్ పై ప్రయాణిస్తున్న అతడిని పోలీసులు ఆపారు.ఓ కానిస్టేబుల్ అతడి స్కూటర్ తాళాలు తీసేసుకున్నాడు.దీనికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజలగి సెల్ ఫోన్ లో రికార్డు చేస్తున్నాడు. ఇంతలోనే ఆ స్కూటరిస్టు తన బండి తాళాలు తిరిగి తీసుకునే ప్రయత్నంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు.
తాను హెల్మెట్ పెట్టుకుని రావడం మర్చిపోయానని, హాస్పిటల్ కు వెళుతున్నానని, తననెందుకు ఆపుతున్నారని షఫీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని షూట్ చేస్తున్నహెడ్ కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.దీంతో పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు.విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును దూషించడమే కాకుండా, శారీరకంగా గాయపర్చడం, నేరపూరితమైన బెదిరింపులకు పాల్పడడం వంటి ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇది కూడా చదవండి: ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ
