మేడారం జాతర సమీపిస్తుండటంతో పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మండమెలిగే పండుగతో మహాజాతరకు మేడారం సర్వంసిద్ధమైంది. వారం రోజుల ముందు జరిగే మండమెలిగే పండుగను ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.
డోలు వాయిద్యాలు నడుమ పూజారులు గ్రామస్థులు దిష్టితోరణాలను కట్టి గ్రామాన్ని అంతా అష్టదిగ్భంధనం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజామున దాకా గద్దెల వద్ద జాగరణ చేశారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లోనూ ఈ మండమెలిగే పండగ ఉత్సవాలు జరిగాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహాజాతర రెండు ఏళ్లకోసారి జరుగుతుంది. జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకల గుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడరోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలు అందుకుంటారు. నాలుగోరోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతరు ముగుస్తుంది.
ఇది కూడా చదవండి : ప్రియుడ్ని కడతేర్చిన ప్రియురాలు..అసలు విషయం తెలుస్తే షాక్ అవుతారు..!!
