గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దూరం కానున్నారు.
- వయోపరిమితి పెంపులో పరిమితులెన్నో
- గ్రూప్-1లో యూనిఫాం పోస్టులకు లేదు
- ‘డీఎస్పీ’కీ వర్తించని రెండేండ్ల పొడిగింపు
- గత దరఖాస్తుదారులకు అవకాశం లేనట్టే
- గరిష్ఠ వయోపరిమితి సడలింపు అందరికీ వర్తింపజేయాలని ఉద్యోగార్థుల డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దూరం కానున్నారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏండ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో అభ్యర్థుల వినతులను దృష్టిలో పెట్టుకొని యూనిఫామేతర పోస్టుల గరిష్ఠ వయసును గత కేసీఆర్ సర్కారు 44 ఏండ్లకు పెంచింది. ఇదివరకు 34 ఏండ్లు ఉండగా, ఏకంగా 10 ఏండ్లు సడలించింది. యూనిఫాం పోస్టులకూ మూడేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఫలితంగా గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వివిధ కారణాలతో రెండుసార్లు గ్రూప్ -1 పరీక్ష రద్దయింది. కొత్తగా కొలువుదీరిన రేవంత్ సర్కారు ఇటీవలే రెండేండ్లు వయోపరిమితి సడలింపునిచ్చింది. యూనిఫామేతర పోస్టులకు మాత్రమే దీనిని పరిమితం చేసింది.
నష్టం జరుగుతుందిలా..
- పోలీసుశాఖలో డీఎస్పీ పోస్టులు 91 ఉన్నాయి. ఎంపీడీవో పోస్టుల తర్వాత ఇవే ఎక్కువున్నాయి. ఈ పోస్టులకు వయోపరిమితి 21- 31 ఏండ్లుగా ఉంది. గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసి ఈ రెండేండ్లలో 31 ఏండ్లు నిండిన వారు ఈ పోస్టులపై అవకాశం వదులుకోవాల్సిందే.
- జైళ్లశాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ పోస్టులు 2 ఉన్నాయి. ఈ పోస్టులకు 18 -31 ఏండ్ల మధ్యవారు అర్హులు. వీటికి మినహాయింపు ఇవ్వలేదు.
- ఎక్సైజ్‌శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు 26 ఉన్నాయి. ఈ పోస్టులకు 21 నుంచి 31 ఏండ్ల మధ్య వయస్కులు అర్హులు. గ్రూప్-1 నోటిఫికేషన్ తర్వాత 31 ఏండ్లు దాటిన వారు ఉద్యోగాలు దక్కించుకోవడం కష్టమే.
- ఈ మూడు పోస్టులకు నోటిఫికేషన్‌లో ప్రకటించిన వయో పరిమితి నిబంధనల ప్రకారం 02-07-1991 తేదీ ముందు జన్మించినవారు అర్హులు కాదు. అంటే 1991జూలై నుంచి 1993 జూలై మధ్యలో పుట్టిన వారు తాజాగా ఈ మూడు పోస్టులకు పోటీ పడే అర్హతను కోల్పోతారు.
- ఇక యూనిఫామేతర పోస్టులకు పోటీపడే వారిలో కొంత మందికి నష్టం జరగనున్నది. గ్రూప్ -1 నోటిఫికేషన్ 2022 ఏప్రిల్ 26న విడుదలైంది. రేవంత్ సర్కారు వయోపరిమితి సడలింపునిస్తూ ఈ నెల 8న జీవోను జారీచేసింది. అంటే ఆయా తేదీ నుంచే సడలింపు అమల్లోకి వస్తుంది. ఈ రెండు తేదీల మధ్యలో వయోపరిమితి నిండిన వారు గ్రూప్-1కు పోటీ పడే అవకాశం కోల్పోతారు.
ఎన్నికల కోడ్‌కు ముందే గ్రూప్-1 షెడ్యూల్ ప్రకటించాలి
రెండేండ్ల నుంచి అభ్యర్థులు వేచిచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌కు ముందే గ్రూప్-1 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేయాలి. అదనపు పోస్టుల సంఖ్యను 60కి పరిమితం చేయకుండా పెంచాలి. వయో పరిమితి సడలింపును గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి వర్తింపజేయాలి.నాన్ లోకల్ అభ్యర్థులు రాకుండా ఉండేందుకు గ్రూప్-1లో తెలుగును క్వాలిఫై పేపర్‌గా పెట్టాలి.
– ప్రభాకర్ చౌటి, పోటీ పరీక్షల శిక్షకుడు
యూనిఫాం పోస్టులకు వయోపరిమితి పెంచాలి
ఇటీవలే ప్రభుత్వం యూనిఫామేతర పోస్టులకు మాత్రమే వయోపరిమితి పెంచింది. ఇది పూర్తిగా అన్యాయం. డీఎస్పీ, ఎక్సైజ్, జైళ్లశాఖలోని యూనిఫాం పోస్టులకు సైతం వయోపరిమితి సడలింపునివ్వాలి. వయో పరిమితి సడలింపు సహా సకాలంలో పోస్టులు భర్తీ చేయకపోతే ఉద్యమాలకు దిగుతాం.
– గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు
