జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..కృష్ణా తుంగభద్ర నదులే మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాధారం. 360 రోజులు నీటిని ఉపయోగించుకునేలా కేసిఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తలపెట్టారు. కొడంగల్, నారాయణ పేటకు నీరు ఇవ్వడానికి పాలమూరు నుంచి రెండు కెనాల్స్ ను ప్రతిపాదించారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డిలో కేవలం 7నుంచి 10శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులు పూర్తిచేస్తే కొడంగల్, నారాయణ పేటకు గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చు. ఆ రెండు కెనాల్స్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా 2900 కోట్లతో ఆ రెండు నియోజక వర్గాల కోసం కొత్త ప్రాజెక్ట్ కు ప్లాన్ చేసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేస్తున్నారు. కానీ ప్రతిపాదిత నిధుల్లో కేవలం అరవై డెబ్బై శాతం ఖర్చు పెడితే ఓపెన్ కెనాల్ తో నీరు ఇవ్వొచ్చు. కేసిఆర్ కట్టిన ప్రాజెక్ట్ తో నీరు ఇవ్వొద్దనే భేషజంతోనే సీఎం రేవంత్ మళ్లీ కొత్త ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. పాలమూరు, రంగారెడ్డి పనులు పూర్తి చేసి నీరిస్తేనే ఎక్కువ ప్రయోజనం.జూరాల పై కొత్త ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ప్రజల పై భారం పడుతుంది. బేషజాలకు వెళ్లకుండా కెనాల్స్ పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో నీరు ఇవ్వొచ్చు. శ్రీశైలంకు వచ్చే నీటిని ఆపేసేలా కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై బ్యారేజ్ నిర్మాణం తలపెడుతోంది. ముందు దాన్ని అడ్డుకోవడం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడి దాన్ని అడ్డుకోవాలి. జాతీయ పార్టీల పొత్తుల కోసం అర్రులు చాచటం లేదు. జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కోసం ప్రయత్నిస్తున్నాయి. పార్టీల పొత్తులు అనేవి అయా పార్టీల అధినేతలు నిర్ణయిస్తారన్నారు.
ఇది కూడా చదవండి:సిద్దిపేట నియోజకవర్గం 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలవాలి
