దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడికి సర్జరీ చేసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ యువకుడి కడుపులో నుంచి 39 నాణేలు, 37 అయస్కాంతాలను బయటకు తీశారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో సర్జరీ చేసిన వైద్యులు యువకుడి కడుపులో నుంచి వీటిని బయటకు తీశారు. 20 రోజులుగా వాంతులు చేసుకుంటు, కడుపు నొప్పితో 26ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
యువకుడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే చేశారు. పొత్తికడుపులోని సీటీ స్కాన్‌లో నాణేలు, అయస్కాంతాల భారీ లోడ్ అవ్వడంతో పేగులో అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తేలింది.దీంతో వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో..అందుకు రోగి అంగీకరించాడు. ఆపరేషన్ తర్వాత, రోగి కడుపు నుండి 39 నాణేలు, 37 అయస్కాంతాలను తొలగించారు.
అయితే ఆ యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అయస్కాంతాలు, నాణేలు ఎందుకు మింగుతున్నారని రోగిని ప్రశ్నించగా.. ఈ లోహాల్లో జింక్ ఎక్కువగా ఉంటుందని భావించి మింగితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. గత కొన్ని వారాలుగా అతను నాణేలు, అయస్కాంతాలను తింటున్నాడని రోగి బంధువులు తెలిపారు. ఈ రోగి మానసిక చికిత్స కూడా పొందుతున్నట్లు బంధువులు తెలిపారు.
రోగి కడుపులో నుంచి మొత్తం 39 నాణేలు (రూ. 1, 2, 5 నాణేలు), 37 అయస్కాంతాలు (గుండె, వృత్తాకారం, నక్షత్రం, మాత్ర, త్రిభుజాకారంలో) బయటపడ్డాయని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత, రోగి ఏడు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఏడు రోజుల తర్వాత కోలుకున్నాక ఇంటికి పంపించారు.
ఇది కూడా చదవండి: సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం..అక్కడిక్కడే ముగ్గురు మృతి.!
