కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంతాల్లో నీటి రేషనింగ్ను ప్రారంభించాయి. అదేవిధంగా నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ వాహనాలను నీటితో కడుగడంతో పాటు స్విమ్మింగ్ ఫూల్ కార్యకలాపాలపై కూడా సొసైటీలు నిషేధం విధించాయి. దక్షిణ బెంగళూరు కనకపుర రోడ్లోని ప్రెస్టిజ్ ఫాల్కన్ సిటీ(పీఎఫ్సీ) అపార్ట్మెంట్స్ అసోసియేషన్ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని రెసిడెంట్లను కోరింది.
కడిగేందుకు నీరు అవసరం లేని డిస్పోజబుల్ ప్లేట్లు, అదేవిధంగా చేతులు, ముఖం కడుక్కునేందుకు ‘వెట్ వైప్స్’ వినియోగించడంపై ఆలోచన చేయాలని కోరడం బెంగళూరులో ఎంతటి నీటి సంక్షోభం ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు..మరి కొన్ని అపార్ట్ మెంట్లలో స్నానం చేయవద్దు..గుడ్డతో తుడుచుకోవాలంటూ స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా సిటీలోని కనకపుర రోడ్డులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్ మెంట్ల సంఘం పిలుపునిచ్చింది. మరి కొన్ని అపార్ట్ మెంట్లలో 20శాతం నీటి వినియోగాన్ని తగ్గించాలని లేదంటే అదనంగా వాటర్ చార్జీలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశాయి.
ఇది కూడా చదవండి: జైలు నుంచి విడుదలైన ప్రొఫెసర్ సాయిబాబా
