కొన్నిరోజుల్లోనే లోకసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేయనుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల త్యాగాన్ని సద్వినియోగం చేసుకుని 2019లో బీజేపీ విజయం సాధించిందని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆంటో ఆంటోనీ అన్నారు. అదే సమయంలో పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన వివాదాస్పద ప్రకటన చేశారు.
2019లో జరిగిన పుల్వామా దాడిలో పాకిస్థాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆంటోనీ, దేశాన్ని కాపాడుతూ కష్టతరమైన ప్రాంతాల్లో మోహరించిన సైనికుల త్యాగాలను సద్వినియోగం చేసుకుని గత ఎన్నికల్లో గెలవలేదా? అంటూ ప్రశ్నించారు. కాగా పతనంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆంటోనీ బరిలోకి దిగారు. 2014 నుంచి ఆయన ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పుల్వామా దాడిపై కాంగ్రెస్ ఎంపీ ఆంటో ఆంటోనీ చేసిన వివాదాస్పద ప్రకటనపై బీజేపీ మండిపడింది. ఆంటోనీ ప్రకటనపై పార్టీ తీవ్రంగా స్పందించి ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్రను కాదనడం ద్వారా కాంగ్రెస్ ఎంపీ దేశాన్ని అవమానించారని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు. ఆంటోనీపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయాలని అన్నారు.
ఫిబ్రవరి 14, 2019న, జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామాలో ఉగ్రవాదులు CRPF కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడిలో పాకిస్థాన్‌తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పేరు వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ కూడా వైమానిక దాడులు చేసింది.
ఇది కూడా చదవండి : జమ్ము కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తాం
