Assembly Elections | ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. 60 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఒకే విడతలో రెండు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కింలో కూడా ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుందని అన్నారు.
కాగా, ఒడిశాలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 42 అసెంబ్లీ స్థానాలకు మే 25న, మరో 42 స్థానాలకు జూన్ 1న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 25 ఎంపీ స్థానాలకు మే 13న ఒకే దశలో ఓటింగ్ జరుగనున్నది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.
