ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఏడాదికి ఒక రోజున ‘ఎర్త్ అవర్’ పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని జరుపుకొంటున్నారు. ఈసారి ఈ నెల 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు. ఆ రోజున అందరూ గంటపాటు అవసరం లేని లైట్లను ఆపివేయాల్సి ఉంటుంది.
మొదటగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ పాటించారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) దీనిని ప్రారంభించింది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక గంటపాటు లైట్లు ఆపివేయాలని పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దీనిని కొనసాగిస్తున్నారు. తొలి పిలుపునకే అనూహ్య స్పందన లభించింది. లక్షలాదిమంది ప్రజలు, వేలాదిమంది వ్యాపారవేత్తలు ఇందులో భాగస్వామ్యమయ్యారు. ప్రస్తుతం ఈ ఇందులో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి.
ఎర్త్ అవర్ వల్ల అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాల వాడకం గంటపాటు ఆగిపోతుంది. ఈ చిన్న పని భూమిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. వాతావరణ మార్పులపై ప్రపంచం మొత్తం ఏకమై చేసే పోరాటానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎర్త్ అవర్ అనగానే గంటపాటు లైట్లు ఆపేస్తే బోల్డంత విద్యుత్తు ఆదా అవుతుందన్నది మనకు కనిపించే అంశం మాత్రమే. కానీ, దీని ద్వారా ప్రపంచానికి ప్రభావవంతమైన సందేశం వెళ్తుంది. పర్యావరణంపై మనకున్న శ్రద్ధను ఇది బయటపెడుతుంది. భవిష్యత్ తరాల కోసం ఈ భూమిని రక్షించాలన్న నిబద్ధతను ఇతరులతో పంచుకునేందుకు, సంఘీభావం ప్రదర్శించేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది.
ఎర్త్ అవర్‌లో పాల్గొనేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా 23న రాత్రి 8.30 నుంచి గంటపాటు అంటే 9.30 వరకు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను కట్టేయడమే. తద్వారా ఆ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆ గంటలో.. నక్షత్రాలను ఎంచక్కా చూడవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. బయటకు వెళ్లి అలా ప్రకృతిని చూస్తూ ఆరుబయట ఎంజాయ్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేలు నష్టపరిహారం ఇవ్వండి
