Elephant | కుమ్రంభీం ఆసిఫాబాద్(Komuram Bhim) జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది.
ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్(Komuram Bhim) జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి హతమార్చింది. పెంచికల్‌పేట మండలం కొండపల్లికి తారు పోషన్న (50) అనే రైతు మిర్చితోటలో పనిచేసుకుంటుండగా దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
విషయం తెలుసుకున్న స్థానికులు ఏనుగును అక్కడినుంచి తరిమేశారు. తాజాగా పెంచికల్‌పేట్ మండ లంలోని అటవీ ప్రాంత మారుమూల గ్రామం కమ్మర్గాం గ్రామ సమీపంలోని పల్లె పకృతి వనంలో(Palle prakruthivanam) ఏనుగు సంచరించడం స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. ఇప్పటికే ఇద్దరిని బలి తీసుకున్న గజరాజు మళ్లీ ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగును బంధించాలని వేడుకుంటున్నారు. కాగా, ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు వస్తే గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఏనుగు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
