Cash Deposit-UPI | యూపీఐ ఆధారిత ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్‌పే తదితర మొబైల్ యాప్స్ ద్వారా క్షణాల్లో బంధువులకు, మిత్రులకు, వ్యాపార లావాదేవీలకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
Cash Deposit-UPI | యూపీఐ ఆధారిత ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్‌పే తదితర మొబైల్ యాప్స్ ద్వారా క్షణాల్లో బంధువులకు, మిత్రులకు, వ్యాపార లావాదేవీలకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అదే యూపీఐ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇందుకోసం థర్డ్ పార్టీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అప్లికేషన్లను ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లతో అనుసంధానించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాస ద్రవ్యపరపతి సమీక్ష సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ బ్యాంకు శాఖలపై క్యాష్ హ్యాండ్లింగ్ లోడ్ తగ్గించడానికి, ఖాతాదారుల సౌకర్యార్థం క్యాష్ డిపాజిట్ మెషిన్ల (సీడీఎం)ను బ్యాంకులు ఏర్పాటు చేస్తాయన్నారు.
ఇప్పటి వరకూ డెబిట్ కార్డుల వినియోగంతో మాత్రమే క్యాష్ డిపాజిట్ సౌకర్యం లభిస్తుంది. ‘తాజాగా యూపీఐ సేవలకు పాపులారిటీతోపాటు ఆమోదం పెరుగుతుండటంతోపాటు ఏటీఎంల వద్ద ‘డెబిట్ కార్డు’ లేకుండా యూపీఐ ద్వారా నగదు విత్ డ్రాయల్ చేయొచ్చు. యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ ఫెసిలిటీ కల్పించాలని ప్రతిపాదిస్తున్నాం’ అని శక్తికాంత దాస్ చెప్పారు. త్వరలో ఈ సేవలు అమల్లోకి వస్తాయన్నారు.
