
వేసవికాలం మొదలైందో లేదో రాష్ట్రంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడి భగభగలు మరింత హెచ్చుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మండే ఎండలంటే అందరికీ భయమే! ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వల్ల వృద్ధులకు ప్రమాదం పొంచి ఉన్నది.
వయసు పైబడటంతో వారి శరీరంలో వేడిని నియంత్రించే సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. దీంతో వాళ్లు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవిని ఆరోగ్యంగా దాటేయొచ్చు.
- వేడి వాతావరణంలో శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలి. దాహంగా అనిపించకపోయినా, తరచూ ద్రవాహారం తీసుకోవడం తప్పనిసరి. కాఫీలు తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవి నిర్జలీకరణానికి కారణం అవుతాయి.
- వృద్ధుల్లో… ముఖ్యంగా గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, నీటిని పరిమితంగా తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవారు.. వేసవిలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్న సమయాల్లో ఇంటిపట్టున ఉండటం మంచిది. అత్యవసరమై బయటికి వెళ్లాల్సి వస్తే.. గాలి తగిలేలా వదులు దుస్తులు ధరించాలి, గొడుగు నీడన నడవాలి.
- మధ్యాహ్నం ఏసీ, కూలర్ వాడటం మంచిది. అవకాశం లేనివాళ్లు గదిలో ఫ్యాన్గాలి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. తడి టవల్ వాడటం వల్ల.. ఫ్యాన్ నుంచి వచ్చే వేడిగాలి కొంత చల్లబడుతుంది.
- బయటికి వెళ్లినప్పుడు వదులుగా ఉండే, లేత రంగు దుస్తులను ధరించాలి. వెడల్పు అంచులతో ఉన్న టోపీలు పెట్టుకుంటే.. ఎండ నుంచి రక్షణ లభిస్తుంది.
- కొన్ని ఔషధాలు శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వైద్యుడిని కలిసి మీ ప్రిస్క్రిప్షన్లో అలాంటి మందులు ఏమైనా ఉంటే, వాటి ప్రభావం గురించి తెలుసుకోండి.
- మీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తగు జాగ్రత్తలు తీసుకోండి.
- ఆహారం విషయంలోనూ నిపుణుల సలహాలు పాటించాలి. మసాలాలు ఉండే పదార్థాలు తగ్గించడం చాలా అవసరం.
- వడదెబ్బకు గురైనట్టు అనిపించినా, ఒంట్లో కలవరపాటుగా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
…? డాక్టర్ సందీప్ ఘంటా
9908239120
