‘తారీఖులు దస్తావేజులు… ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్న శ్రీశ్రీ సందేశం అందుకుని ప్రభువెక్కిన పల్లకీలు పట్టించుకోకుండా ‘మా ఊరి మట్టి వాసన, మా ఏటి నీటి తియ్యదనం, మా అమ్మ పాట కమ్మదనం, మా ఊరి విశేషాలు, మా ఆటపాటలు, మా జిల్లాలో ఊరేగిన ఉద్యమాలు, మేం కట్టిన చారిత్రక కట్టడాలు’ అంటూ జిల్లా విశేషాలెన్నో కవితా పంక్తుల్లో రాసుకొచ్చారు ఖమ్మం కవులు.

‘తారీఖులు దస్తావేజులు… ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్న శ్రీశ్రీ సందేశం అందుకుని ప్రభువెక్కిన పల్లకీలు పట్టించుకోకుండా ‘మా ఊరి మట్టి వాసన, మా ఏటి నీటి తియ్యదనం, మా అమ్మ పాట కమ్మదనం, మా ఊరి విశేషాలు, మా ఆటపాటలు, మా జిల్లాలో ఊరేగిన ఉద్యమాలు, మేం కట్టిన చారిత్రక కట్టడాలు’ అంటూ జిల్లా విశేషాలెన్నో కవితా పంక్తుల్లో రాసుకొచ్చారు ఖమ్మం కవులు. ఏ జిల్లా చరిత్ర, విశేషాలూ ఇలా కవిత్వమై రాలేదు. చరిత్ర కొత్త మెట్టు ఎక్కినట్టుగా ఖమ్మం మెట్టు కవిత్వానికి నూతన ఒరవడిని ఇచ్చారు కవయిత్రులు సుభాషిణి తోట, సునంద వురిమళ్ల. ఖమ్మం ఒకరికి పుట్టినిల్లు, మరొకరికి మెట్టినిల్లు. వారిద్దరి సంపాదకత్వంలో ‘ఖమ్మం జిందాబాద్’ అనిపించారు! ‘ఖమ్మం కవుల గుమ్మం’ అని నిరూపించారు! కష్టాల నేపథ్యం నుంచి మొదలై ఇష్టమైన సాహితీ సేద్యం చేస్తున్న ఇద్దరు కవయిత్రులు సంకల్పంతో సాధించిన సంకలన విజయం ఇది!
‘మా నాన్న తెలుగు ఉపాధ్యాయుడు. నాన్న రాసిన పాటలు, నాటకాలు వింటూ పెరిగాను. కానీ, అవేవీ నన్ను సాహిత్యంపై అభిమానం పెంచుకునేంత ప్రభావం చూపించలేదు. పెండ్లయిన తర్వాత నా మనసుకు అయిన గాయాలే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి’ అంటున్నది కవయిత్రి, ఖమ్మం జిందాబాద్ సహ సంపాదకురాలు సుభాషిణి తోట. సాధారణ గృహిణి సాహిత్యంవైపు నడవడానికి అనేక కష్టాలే కారణమని చెబుతూ తన అనుభవాలు పంచుకుంది.
నేను ఎమ్మెస్సీ, బీఎడ్ చదివాను. మా ఆయన
ఉపాధ్యాయుడు. పదిహేనేండ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయాడు. భర్త మరణంతో డీఎస్సీ పరీక్ష రాయలేకపోయాను. కారుణ్య నియామకం ద్వారా విద్యాశాఖలో జూనియర్ క్లర్క్ ఉద్యోగం వచ్చింది. ఆయన జ్ఞాపకంగా ఉందనుకున్న బిడ్డ కూడా నాకు దక్కకుండా పోయింది. అరుదుగా వచ్చే మైటోకాండ్రియా జబ్బు బారినపడింది. లక్షలు ధారపోసినా తగ్గలేదు. మందులేని జబ్బు నా బిడ్డను నాకు కాకుండా తీసుకుపోయింది. చిన్న వయసులోనే నాకు
డయాబెటిస్ వచ్చింది.
భావాల తోటలో ఒంటరిగా..
ఆ దుఃఖం నుంచి బయటపడటానికి సాహిత్యాన్ని ఆశ్రయించాను. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు కవిత్వం చదివాను. కాస్త ఉపశమనం దొరికింది. కవిత్వమంటే ఇష్టం పెంచుకొన్నాను. గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్ర శర్మ, దేవరకొండ బాలగంగాధర తిలక్ కవిత్వం బాగా చదివాను. మనసుకైన గాయం మానుతుందేమోనని, సంతోషం దొరుకుతుందేమోనని సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. బాధలు మర్చిపోయాను. మనసు తేలికపడ్డట్టయింది. మనసులో గూడు కట్టుకున్న ఒంటరితనం దూరమైంది. సాహిత్యం చదవడంతో మొదలుపెట్టి రాయడం దాకా వచ్చాను. పదేండ్ల కిందటే కవిత్వం, సాహిత్య విమర్శలు రాశాను.
ఏడాది తర్వాత మరింత కృషి చేయడం ప్రారంభించాను. స్త్రీవాదంలోని మానవత గురించి కవితలు రాశాను. ఆ కవిత్వాన్నంతా ‘రెండు ఒకట్ల పదకొండు’ పేరుతో సంకలనం చేశాను. నా సాహితీ ప్రయాణంలో.. నా సంపాదకత్వంలో ‘శిథిలాల్లో మొలిచిన అక్షరాలు’ అనే సంకలనం తీసుకువచ్చాను. అదే నా మొదటి పుస్తకం. ‘ఖమ్మం జిందాబాద్’ ఏడోది. 38 ఏండ్ల వయసులో ఎంత దుఃఖాలను చవిచూశానో అన్ని పుస్తకాలు తెచ్చాను. ట్రాన్స్ జెండర్స్ కష్టాల ‘థర్డ్ వాయిస్’, మిర్చి రైతు కన్నీళ్ల ‘కవిత్వం మండుకొస్తోంది’, రేపిస్టుల భారతంలో ‘దయ్యం పోరగాళ్లు’, ‘క్రిమి సంహారం’, ‘తిరంగా’ కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించాను.
ఎడతెగని ప్రయాణం
నేను పుట్టిన ఖమ్మం, నేను పెరిగిన ఖమ్మం జిల్లా ఏర్పడి ఏడు దశాబ్దాలైంది. 70 ఏండ్ల ఖమ్మం గురించి తెలుసుకోవాలని జిల్లా చరిత్ర చదివాను. ఆ చరిత్రనంతా అక్షరమాలగా అల్లాలనిపించింది. కథంతా కవితలతో కూర్చడం కష్టమైన పనే! ఖమ్మంలో కవులకు కొదువ లేదు. కానీ, ఒంటరిగా సాధ్యం కాదనిపించింది. ఖమ్మంలోనే ఉండే కవయిత్రి, తెలుగు ఉపాధ్యాయురాలు సునందను కలిశాను. నా ఆలోచన పంచుకున్నాను. ఖమ్మం వైభవాన్ని కవితాక్షరాల్లో ఆవిష్కరించాలని ఇద్దరం నిర్ణయానికి వచ్చాం. 70 మంది కవులతో కవిత్వం రాయించడం కోసం వందల మంది కవులను సంప్రదించాం.
జిల్లా భౌగోళిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కవితా వస్తువులను కవుల ముందుంచాం. ఇష్టమైన అంశాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాం. ‘మంచిపని చేస్తున్నారు’ అని చాలామంది ముందుకొచ్చారు. మా సెలవు రోజుల్ని జిల్లాకు కేటాయించాం. సొంతంగా ఖర్చుపెట్టుకున్నాం. రచయితలు పంపిన కవితలను ఏర్చి కూర్చి డబ్బు ఏండ్ల ఖమ్మం జిల్లా వైభవానికి ఒక రూపునిచ్చాం. సాహిత్య చరిత్రలో ఖమ్మం సృజనను చదివి ‘ఖమ్మం జిందాబాద్’కి ముందుమాటగా అలంకరించాను. ఒంటరి పోరాటంలో నేను ఓడిపోలేదు. సాహిత్యం నాకు మానసిక ప్రశాంతతను ఇచ్చింది. ఏదో ఒకటి చేయాలనే సంకల్ప బలాన్నిచ్చింది. అంతకన్నా రెండు రెట్ల సంతోషాన్నిచ్చింది.
రుణం తీర్చుకున్నా
నేను నల్లగొండ జిల్లా ఆడబిడ్డని. మోతె మండలంలోని సిరికొండలో పుట్టాను. పది పాసయ్యాక కోడలిగా ఖమ్మంలో అడుగుపెట్టాను. ఈ జిల్లాతో నాది నలభై ఏండ్ల అనుబంధం. నాకు సాహితాన్ని పరిచయం చేసింది ఈ ప్రాంతమే. చదువు, సాహిత్యం, ఉపాధ్యాయ జీవితం అంతా ఖమ్మంతోనే ముడిపడి ఉంది. ‘ఖమ్మం జిందాబాద్’తో ఈ జిల్లా రుణం తీర్చుకున్నాను.
– సునంద వురిమళ్ల
ఖమ్మం హృదయం ‘ఖమ్మం అనగానే నా హృదయం
పులకించిపోతుంది’ అంటాడు దాశరథి. ఆ మట్టిలో పుట్టి, ఆ నీళ్లు తాగిన చైతన్యం ఊరికే ఉంటుందా? కలం పట్టడం నేర్పిన ఖమ్మం గురించి ఘనంగా చాటిచెప్పింది. ‘చరిత్రను భద్రపరిచి ముందుతరానికి అందజేయవలసిన బాధ్యత మనమీద ఉంది. ఆ కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యామో భావితరం క్షమించదు’ అని హెచ్చరించాడు ఖమ్మం జిల్లా కవి కౌముది. ఆయన అడుగుజాడల్లో నడిచిన నేటి తరం కవులు శిలాశాసనాలు, పురావస్తు ఆధారాల ఆసరా లేకుండానే జిల్లా చరిత్రను హృదయ భాషలో రాసుకొచ్చారు. ఒకప్పటి ఉమ్మడి వరంగల్లు జిల్లా నుంచి విడిపోయి ఖమ్మం జిల్లా ఏర్పడింది. 1953 అక్టోబరు
1న ఏర్పడిన ఖమ్మం జిల్లాకు 70 వసంతాలు నిండాయి. ఈ 70 ఏళ్ల సందర్భంగా 70 విశేషాలతో 70 మంది కవులు కవితా మాలలల్లి ‘ఖమ్మం జిందాబాద్’ అంటూ లక్షల అక్షరాలతో జేజేలు పలికారు.
…? నాగవర్ధన్ రాయల
బండారి మహేశ్