ఆన్లైన్లో గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి కొత్త డ్రామాకు తెరలేపింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి డబ్బులు దోచుకెళ్లారని ఇరుగుపొరుగు అందర్నీ నమ్మించింది. పోలీసుల రాకతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఇవాళ(గురువారం) ఉదయం 10 గంటల సమయంలో ఓ ఇంట్లో దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపింది. తన ఇంట్లో దొంగలు పడ్డారని ఓ యువతి కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాను వాష్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో కొంతమంది దొంగలు ఇంట్లోకి ప్రవేశించారని ఆ యువతి పోలీసులకు చెప్పింది. ఇంట్లోని వస్తువులను, బీరువాలోని బట్టలను చిందరవందరగా పడేసి.. బీరువాలోని బంగారం, డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పింది. వారిని పట్టుకోబోయే క్రమంలో తనను తోసేసి ఇంట్లో నుంచి పారిపోయారని తెలిపింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయం తెలిసింది.
ఆన్లైన్ గేమ్ ఆడి రూ.25 వేలు పోగొట్టుకున్న యువతి.. ఇంట్లో తెలిస్తే తిడతారని ఇలా చోరీ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. చోరీ డ్రామా ఆడినందుకు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పోగొట్టుకుని.. ఇంట్లో తెలిస్తే తిడతారని యువతి ఇలా చోరీ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పాలనలో మాలలకే అధిక ప్రాధాన్యత